మామిళ్లగూడెం, జనవరి 9 : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధపై ఎలక్టోరోల్ అధికారులు, జిల్లా అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో నూతన కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక చేపట్టాల్సి ఉందన్నారు. ఎన్నిక నిర్వహణకు తాజా ఓటరు జాబితా రూపకల్పనకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షెడ్యూల్ విడుదల చేసినట్లు చెప్పారు. ఈ షెడ్యూల్ మేరకు 2023 డిసెంబర్ 30న పబ్లిక్ నోటీసు జారీ కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఫారం-18 ద్వారా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 తుది ఓటరు ప్రచురణ ఉంటుందని చెప్పారు. 2023 నవంబర్ 1కి మూడేళ్ల ముందు గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని అన్నారు. ఫారం-18 దరఖాస్తును మాన్యువల్‌గా గానీ, www. ceotelangana. nic. in వెబ్సైట్ ద్వారా గానీ సమర్పించవచ్చునని తెలిపారు. నమోదు కోసం దరఖాస్తుతోపాటు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాన్ని గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలని, ఫొటోగ్రాఫ్‌ను, ఎపిక్ కార్డ్ కాపీని జతచేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు.
విద్యుత్ కనెక్షన్లు లేని గృహాలకు కనెక్షన్లు ఇచ్చేలా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గృహజ్యోతి, మిషన్ భగీరథ, గిరి వికాసం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్ల విద్యుత్ కనెక్షన్లపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన అభయహస్తం కింద దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు. బ్లాంక్ దరఖాస్తులపై సదరు దరఖాస్తుదారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖమ్మం రూరల్, జనవరి 9: ఆరు గ్యారెంటీల దరఖాస్తుల డాటా నమోదు ఏ చిన్న పొరపాటు లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు నమోదు చేసింది, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. రేషన్, ఆధార్ కార్డు నెంబర్లు జాగ్రత్తగా నమోదు చేయలన్నారు. దరఖాస్తుల డాటా ఎంట్రీ ఆపరేటర్లు సూచించిన ప్రదేశాల్లో మాత్రమే నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో రవిందర్‌రెడ్డి, ఏపీవో శ్రీదేవి తదితరులున్నారు.
కొణిజర్ల, జనవరి 9 : ‘ప్రజాపాలన’లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తనికెళ్ల విజయ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్లో డేటా ఎంట్రీను చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, ట్రైనీకలెక్టర్ మయాంక్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ డాటా ఎంట్రీని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీవో మహాలక్ష్మి, తహసీల్దార్ తాఫీజ్హుస్సేన్ పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, జనవరి 9 : జిల్లాలో సీఎంఆర్ రైస్ డెలివరీ ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లు, అధికారులతో ఖరీఫ్ 2022-23 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ రైస్ డెలివరీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐకి 182790 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 171754.900 మెట్రిక్ టన్నులు అందించగా.. ఇంకా 11035.122 మెట్రిక్ టన్నులు అందజేయాల్సి ఉందన్నారు. బాకీ ఉన్న బియ్యాన్ని జనవరి 25వ తేదీలోగా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని ఆదేశించారు. ఎఫ్‌సీఐకి మనమే సీఎంఆర్ కోటా తీసుకొని, ఆ లక్ష్యాన్ని సాధించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. లక్ష్యం చేరుకోకపోతే వచ్చే సంవత్సర కేటాయింపు తగ్గుతుందన్నారు. సీఎంఆర్ రైస్ డెలివరీపై లక్ష్యాన్ని చేరుకోని మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, ఎఫ్‌సీఐ డివిజనల్ మేనేజర్ రంగప్రసాద్ నాయక్, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.