దమ్మపేట, ఏప్రిల్ 23 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇచ్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని మామిడి తోటలో మంగళవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. డిసెంబర్ 9న ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు, అత్తకు రూ.4 వేలు, కోడలికి రూ.2,500 పెన్షన్, రూ.2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, ఆటో కార్మికులకు రూ.12 వేలు, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పి మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు. తాను తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యే నాటికి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులే లేదన్నారు. దీంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను తీసుకొచ్చానన్నారు. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండుతోందని, ఈ విషయాన్ని పార్లమెంటులో మోదీ ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. అభివృద్ధిపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్‌కు సింగరేణితో రాష్ట్ర వాటా నిధులు ఇప్పించి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ పూర్తి చేయడమేనని అన్నారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు సైతం నడిపించడానికి కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ నాయకులు మట్టి, ఇసుక దందాతో దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనే దిక్కు కాంగ్రెస్ పాలనలో కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడుదారులతోపాటు రైతులందరికి రైతుబంధు జమ చేయలేదన్నారు.
ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నదని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల పక్షపాతిగా కేసీఆర్ రైతుల గుండెల్లో ఉన్నారన్నారు. దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో కేసీఆర్ హయాంలో రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. సమావేశంలో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, వగ్గెల పూజ, దమ్మపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, దొడ్డా రమేశ్, దారా యుగంధర్, దారా మల్లికార్జునరావు, పర్వతనేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.