భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : వర్షాలు రాకముందే వైరల్ జ్వరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వణికిస్తున్నాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులతో ప్రజలు చతికిలబడుతున్నారు. వైరల్ జ్వరాలతో ఇంటికే పరిమితమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వైద్యశాఖ గ్రామాల్లో ర్యాపిడ్ సర్వే చేస్తున్నది. గొత్తికోయల గ్రామాలే టార్గెట్గా వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. కానీ.. వైరల్ జ్వరాలతో మాత్రం జనం వణికిపోతున్నారు.
భద్రాద్రి జిల్లాలో పారిశుధ్య లోపంతో ఏటా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ శిబిరాలు ఏర్పాటు చేసినా సీజన్లో మాత్రం మలేరియా కేసుల నమోదు తగ్గడం లేదు. గతేడాది జిల్లాలో 185 మలేరియా కేసులు నమోదయ్యాయి. 16 డెంగీ కేసులు కూడా నమోదైనట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కేవలం వలస గ్రామాల్లోనే వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపడుతూ.. మిగతా గ్రామాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వానకాలం వచ్చిందంటే చాలు వసతి గృహాలు, గిరిజన గ్రామాల్లో జ్వరాల బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. వలస గ్రామాల్లో ఉన్న రోగులు అన్ని ప్రాంతాల్లో పనులు చేస్తుండడంతో మలేరియా వ్యాప్తి చెందుతున్నదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 27 మలేరియా పాజిటివ్ కేసులు, 5 డెంగీ కేసులు నమోదయ్యాయి.
ఏటా మలేరియా, డెంగీ జ్వరాలు జనాల్ని పట్టిపీడిస్తున్నా హైరిస్క్ ప్రాంతాల్లో మాత్రమే వైద్య శాఖ ర్యాపిడ్ సర్వే చేసి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో 190 హైరిస్క్ గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో జ్వరాలు ఉన్న వారి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు దోమల మందు పిచికారీ చేస్తున్నారు. వసతి గృహాలు ఉన్నచోట కూడా దోమల మందు పిచికారీ చేస్తున్నారు.
జిల్లాలోని ప్రతీ మండలంలోనూ ఆసుపత్రులు ఉన్నా మందుల కొరత సమస్య మాత్రం తీవ్రంగా వెంటాడుతున్నది. ప్రతీ ఏటా ఈ సమస్య ఉంటుందని అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్లచేసుకుంటున్నారు.
నాకు జ్వరం ఒక్కరోజే ఉంది.. కానీ.. వారం రోజులు ఒళ్లు నొప్పులు ఉన్నాయి. దోమలు పెరిగితే మలేరియా జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖరీదైన మందుల్లేవు. మా మండలంలో వలసవాదులు ఎక్కువగా ఉన్నారు. రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ గ్రామాల్లో రోగాలను నియంత్రించకపోతే ప్రమాదమే.
-అనగంటి బాలకృష్ణ, చినబండిరేవు, దుమ్ముగూడెం
మలేరియా నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ర్యాపిడ్ సర్వే చేశాం. మలేరియా లక్షణాలు లేనివారిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 160 గ్రామాల్లో రెండు విడతలు సర్వే చేసి జ్వరాల బాధితులను గుర్తించి మందులు ఇచ్చాం. వానలు పడితే జ్వర బాధితుల సంఖ్యం పెరుగుతుంది. నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్బాల్స్ వేస్తాం. గంబూషియా చేపలను కూడా పెంచుతున్నాం. ఇందుకోసం ప్రత్యేక ప్రోగ్రాం అధికారి ఉన్నారు. మందుల సమస్య ఎక్కడా లేదు. ప్రోగ్రాం అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
– డాక్టర్ భాస్కర్నాయక్, డీఎంహెచ్వో, భద్రాద్రి