ఖమ్మం, మే 12: బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వైరా ఎమ్మెల్యే రాముల్‌నాయక్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే తండాల్లో అడుగు కూడా పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైన విషయాన్ని గమనించాలని హితవు చెప్పారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్.. సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతూ దేశంలోనే గిరిజన బిడ్డలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే ముందు మీ పరిస్థితి గురించి ఆలోచించాలని సూచించారు. విచక్షణ కోల్పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాతనే రాష్ట్రంలోని గిరిజనుల బతుకుల్లో మార్పులు వచ్చిన విషయాన్ని గమనించాలని సూచించారు. తెలంగాణలో 2,471 నూతన గిరిజన గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అందువల్లనే అనేకమంది గిరిజనులు సర్పంచ్‌లుగా ఎన్నిక కాగలిగారని, ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే తండాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని గుర్తుచేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన రవీంద్రనాయక్‌కు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రయినా గిరిజనుల అభివృద్ధికి నిధులు ఇచ్చారోలేదో తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు బాణోత్ సురేశ్‌నాయక్, బాణోత్ కుమార్‌నాయక్, భూక్యా చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.