బూర్గంపహాడ్, జూన్ 20 : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సారపాక గ్రామస్తులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు ఎదుట బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లగొమ్మూరు పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే బయటకు వస్తుండగా సారపాక గ్రామస్తులు.. ఆయన కారు ఎదుట బైఠాయించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ఈవోకు సైతం సమస్యను వివరించినా పరిష్కారం కాలేదని ఆరోపించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి, పక్కకు తీసుకెళ్తుండగా ఈ ఘటనను చిత్రీకరిస్తున్న సెల్‌ఫోన్‌ను సైతం ఆయన అనుచరులు లాక్కున్నారు. గ్రామస్తులను సముదాయించిన ఎమ్మెల్యే తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.