మణుగూరు టౌన్, జూన్ 23 : ‘తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి పూర్తి న్యాయం చేసిన తర్వాతే సింగరేణి ఓసీ సంగతి చూడాలని, అప్పటి వరకు పనులు చేస్తే ఊర్కునేది లేదు’ అని హెచ్చరిస్తూ మణుగూరు మండలం రాజుపేట, విఠల్‌రావు నగర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. తొలుత భారీ ప్రదర్శనతో తహసీల్‌కు చేరుకున్న మహిళలు ‘మా ప్రాణాలు కాపాండండి..’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆ గ్రామాల ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామాలకు సుమారు 50 మీటర్ల దూరంలోనే ఓసీ ఉన్నదని, దీంతో ఇండ్లలో నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ ప్రభావంతో ఇండ్ల గోడలు బీటలువారి దుమ్ము దూళీ చేరడంతోపాటు తాగునీరు సైతం కలుషితమవుతున్నాయని, ఆ నీరు తాగడంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. గ్రామసభ నిర్వహించకుండా సమావేశం పేరుతో పిలిపించి సంతకాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బొజ్జ సదానందం, ఐయితనబోయిన వెంకన్న, మంద కృష్ణ, ఈర్ల రాంకోటి, శ్రీకాకుళం వీరమల్లు, వేల్పుల సుజాత, పుష్పాల అనిత, స్వరూప, తోడేటి వెంకటేశ్వర్లు, సతీశ్, కనకాల సంపత్, పరాల శ్రీను, వెంకట్రాములు, తమ్మిశెట్టి బాలయ్య, బక్క ఉమ, ఏర్పుల గణేశ్, వంగపల్లి పూర్ణ, ప్రభాకర్, తమ్మిశెట్టి బాలయ్య, రాజయ్య, ఉమ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.