మణుగూరు టౌన్, నవంబర్ 14: వందలకొద్దీ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మణుగూరు మండలంలోని రాజుపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిపై టెంట్ వేసి గ్రామస్తులంతా బైఠాయించి నిరసన తెలిపారు. లారీలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇసుక లారీల వల్ల దుమ్ముధూళితో అనారోగ్యం పాలవుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇసుక ర్యాంపుల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసనతో ఇసుక లోడ్ లారీలు సుమారు 200 అక్కడే నిలిచిపోయాయి. లారీడ్రైవర్లు నానా అవస్థలు పడ్డారు.
గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఇసుక లారీలు, సింగరేణి లారీలను కదలకుండా చేశారు. ఆరు ర్యాంపులకు ఒక్కటే మార్గం కావడంతో నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ నాగబాబు, సింగరేణి ఏజీఎం, పీవో, టీజీఎండీసీ పీవో శంకర్ నాయక్‌లు గ్రామానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి సర్దిచెప్పడంతో లారీలను పంపించారు. మళ్లీ ఇసుక లారీలు తమ గ్రామం నుంచి వస్తే అడ్డుకుంటామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. మణుగూరు- ఏటూరు నాగారం రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామస్తుల నిరసనకు బీఆర్ఎస్ నేతలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, రాంకోటి, శ్రీను, నర్సింహారావు, సృజన్, రవి, రంజిత్ మద్దతు తెలిపారు.