భధ్రాచలం, ఏప్రిల్ 13: భద్రాచలంతోనే తమ పేగుబంధం ముడిపడి పడి ఉందని ఐదు విలీన పంచాయతీల ప్రజలు నినదిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. భద్రాద్రి రాముడి పాదాల చెంతకు ఎప్పుడు చేరుదామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రిటైర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, టీజీవోస్, టీఎన్జీవోస్ యూనియన్ల ఆధ్వర్యంలో భద్రాచలంలో సోమవారం నిర్వహించిన ‘భద్రాద్రి పునరేరీకరణ’ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో విలీనం చేసిన కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి భద్రాచలానికి ఇస్తేనే భద్రగిరికి ఒక రూపు వస్తుందని అన్నారు. ఇప్పుడీ గ్రామాల ప్రజలు ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటూ సద్దికట్టుకొని వెళ్లాల్సి వస్తోందని, అలా వెళ్లినా తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని, ఆ పంచాయతీలను తెలంగాణ కలపాలని చేపట్టే ఉద్యమానికి ఈ వేదిక నుంచే శంఖారావం పూరిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సైతం అసమగ్రంగా జరిగిందని, ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అలాగే, భద్రాచలంలో చెత్త వేయడానికి కూడా స్థలం లేకపోవడంతో పదేళ్లుగా గోదావరి ఒడ్డునే చెత్తును డంప్ చేస్తుండడంతో గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఆ ఐదు పంచాయతీల ప్రజలను ఓట్లు అడిగేందుకు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ రారని, ఐదు పంచాయతీల్లో సమస్యలను సైతం ఏపీ ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించారు. ఈ సమస్య మన తెలంగాణదో, భద్రాచలానిదో కాదని అన్నారు. భద్రాద్రి శ్రీరాముడి గౌరవానికి, అస్తిత్వానికి సంబంధించినదని అన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలపాలని, లేదంటే భద్రాచలం కేంద్రంగా పాలన సాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రా్రష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఐదు పంచాయతీలు భద్రాద్రి పునర్జీవానికి, తెలంగాణ అస్థిత్వానికి సంబంధించినవని అన్నారు. తాము చేపట్టిన ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ.. ఆ ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేసే వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జేఏసీ నేతలు గుంటుపల్లి శ్రీనివాసరావు, అమరనేని రామారావు, డెక్క నరసింహారావు, బాలకృష, చైతన్య భార్గవ్, చల్లగుళ్ల నాగేశ్వరరావు, కామేశ్వరావు, బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, ఆకోజు సునీల్, కావూరి సీతామహాలక్ష్మి, నక్కా వెంకన్న, సంపత్, అజ్జి నాయక్, శివ, అవులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.