భద్రాచలం, అక్టోబర్ 13: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శనివారం శమీపూజను వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఆయుధాలను మేళతాళాలతో దసరా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం శమీపూజ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. దసరా సందర్భంగా ఆలయంలో శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు ఉదయం మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం స్వామివారికి శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహించారు. ముందుగా నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. తరువాత శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగాశ్రీరామహా పట్టాభిషేకాన్ని వైదిక సిబ్బంది నిర్వహించారు. అదేవిధంగా దసరాను పురస్కరించుకొని పది రోజులపాటు శ్రీరామాయణ పారాయణం నిర్వహించే సమయంలో నిత్యహోమం నిర్వహించగా.. చివరి రోజున పూర్ణాహుతి గావించారు.
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి మహారాజ అలంకారం చేశారు. భాజభజంత్రీలు, మేళతాళాలతో విజయోత్సవం, శమీపూజ కోసం స్థానిక దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. శమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత సుదర్శనం, ఖడ్గం, ధనస్సు గద తదితర ఆయుధాలకు పూజలు చేసి ఉద్వాసన పలికారు. చివరగా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరునకు ఆవాహనం చేసి బాణాలు సంధించారు.
ఈ సందర్భంగా జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి చివరగా వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. అనంతరం శ్రీరామ్లీలా మహోత్సవాన్ని నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. ఈ సమయంలో రావణాసుర బొమ్మపై దేవస్థాన ఈవో ఎల్.రమాదేవి బాణాన్ని సంధించారు. చివరగా స్వామివారిని రామాలయానికి తీసుకొచ్చారు అలాగే, పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోనూ విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.