భద్రాచలం, ఆగస్టు 11: డబుల్ బెడ్రూం ఇంటికి సంబంధించి గ్రామసభలో తన పేరు చదివిన అధికారులు ఇల్లు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన ఓ మహిళ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లింది. ఆ తరువాత తన వెంట బాటిల్లో తీసుకెళ్లిన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సరితకు మనుబోతుల చెరువు ప్రాంతంలోని డబుల్ బెడ్రూం సముదాయంలో ఇల్లు కేటాయిస్తున్నట్లు అధికారులు గ్రామసభలో పేరు చదివి వినిపించారు.
అయితే ఇప్పటివరకు ఇల్లు కేటాయించకపోవడంతో విసిగిపోయిన సరిత.. సోమవారం పెట్రోల్ బాటిల్తో ఇళ్ల సముదాయం వద్దకు చేరుకుంది. ఓ ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లి బైఠాయించింది. ఈ ఇంట్లో ఎవరూ లేరని, ఖాళీగా ఉన్న ఈ ఇంటిని తనకు కేటాయించాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటానని హెచ్చరించింది. కొందరు తమకు వచ్చిన ఇండ్లను అద్దెకు ఇస్తున్నారని ఆరోపించారు. అలాంటి ఇండ్లను తమలాంటి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేసింది. అయితే మహిళ ఆందోళన విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ‘నీ పేరు ప్రతిపాదిత జాబితాలో ఉంది. ఉన్నతాధికారులతో చర్చించి ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం’ అంటూ హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించింది.