ఖమ్మం, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో సర్కారు చేసిన నిర్లక్ష్యం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మిగిలింది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, విధివిధానాలు లేకుండా ఆర్భాటంగా ప్రక్రియను నిర్వహించాలనుకోవడం, జాబితా వెలువరించకుండానే సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేయడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసినా డీఎస్సీ జాబితా రాకపోవడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర పాలనకు అద్దం పడుతోంది. ‘డీఎస్సీ ఫలితాలు విడుదల చేశాం. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తాం. సీఎం చేతుల మీదుగా ఉత్తర్వులు అందిస్తాం..’ అంటూ సోమవారం ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం చేతల్లో చతికిలబడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు ఉండవని 24 గంటలు గడవకముందే తెలంగాణ ప్రజలకు మరోసారి తేటతెల్లమైంది. డీఎస్సీ-2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. 1:3 నిష్పత్తితో కూడిన అభ్యర్థుల జాబితా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా విద్యాశాఖకు రాలేదు. దీంతో సదరు అభ్యర్థులకు రోజంతా ఎదురుచూపులే మిగిలాయి.
డీఎస్సీ-2024 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మంగళవారం ఖమ్మం రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లలో వివిధ కేటగిరీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 11 బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ఇద్దరు గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌ను నియమించారు. వీరంతా ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించే పాఠశాలకు చేరుకున్నారు. నిర్దేశించిన సమయం గడుస్తున్నా ఉన్నతాధికారుల నుంచి జాబితా అందలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదురుచూసినా జాబితా పరిశీలన జరగలేదు.
ఈ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన డీఎస్సీ కావడంతో ఆటంకాలు జరుగకుండా ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) శ్రీనివాసాచారి మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఈవో సోమశేఖర శర్మతో వెరిఫికేషన్ ప్రక్రియపై చర్చిస్తూనే ఉన్నారు. అభ్యర్థులు కూడా సహనానికోర్చి వేచిచూశారు. వారు ఉదయం ఉన్నతాధికారులను సంప్రదిస్తే మధ్యాహ్నం వరకు జాబితా వస్తుందని చెప్పారు. మధ్యాహ్నం చేస్తే మరో గంటలో వస్తుందని, ఆ తర్వాత చేస్తే సాయంత్రం 5 గంటల్లోపు వస్తుందని సమాధానమిస్తూ వచ్చారు. చివరికి డీఎస్సీ జాబితా రాలేదని, వచ్చాక సమాచారం ఇస్తామని చెప్పి అభ్యర్థులను పంపించారు.
జిల్లాల వారీ డీఎస్సీ ఫలితాలపై సోమవారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. మంగళవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అంటే అభ్యర్థుల్లోనూ గందరగోళం నెలకొంది. ‘ధ్రువపత్రాల పరిశీలన జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవడం. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు సొంత ఊర్లకు చేరుకోవడం, నాన్ క్రిమీలేయర్ వంటి సర్టిఫికెట్లు తీసుకోవడం వంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇవన్నీ సరిచూసుకునేందుకు ఒక్కరోజు కూడా సర్కారు సమయం ఇవ్వలేదు. అయినప్పటికీ వెంటనే షెడ్యూల్ ఇవ్వడం, ఇచ్చిన షెడ్యూల్‌ను అమలు పర్చకపోవడం పట్ల అభ్యర్థుల్లో నిరుత్సాహం, గందరగోళం నెలకొన్నాయి.
ఎస్జీటీ విభాగంలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చాను. ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలనపై ఎలాంటి సమాచారమూ లేదు. జాబితా కూడా వెలువరించలేదు. హడావిడిగా కాకుండా ఒక రోజు సమయం ఇచ్చి ప్రక్రియను నిర్వహిస్తే బాగుండేది. నిన్నంతా రిజల్ట్స్ చూసుకోవడానికే సరిపోయింది, సర్టిఫికెట్లు అన్ని చెక్‌లిస్ట్ ప్రకారం తయారుచేసుకోవాలి.
-నాగరాజు, డీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థి
డీఎస్సీ-2024 సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా బుధవారం నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు, గురువారం నుంచి స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)కు ఖమ్మం రోటరీనగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు.
మా నాన్న సర్దార్ కారేపల్లిలో మెడికల్ షాపు నిర్వహిస్తారు. డీఎస్సీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు 35 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మం వచ్చాం. కానీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరగట్లేదు. దీనిపై ముందస్తుగా కొంత సమాచారం ఇస్తే ఇక్కడ వరకు వచ్చేవాళ్లం కాదుకదా.
-రిజ్వానా, డీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థిని