Twins Day | రఘునాథపాలెం, ఫిబ్రవరి 21: ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. ఆ ఊరికీ ఓ ప్రత్యేకత ఉంది. అది మామూలు ప్రత్యేక ఏమీ కాదు. చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రత్యేకత. ఆ ఊరే.. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల. ఆ ప్రత్యేకతే.. కవలల గ్రామం. అవును.. ఆ గ్రామంలో ఏకంగా తొమ్మిది మంది జంట కవలలున్నారు. అందులో ఓ మహిళ రెండు కాన్పుల్లోనూ కవలలే జన్మించారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ముఖచిత్రంతో కనిపిస్తే చిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు.. ఆశ్చర్యంగా వాళ్లనే చూస్తూ ఉండిపోతాం. కానీ వేపకుంట్ల గ్రామస్తులకు ఈ దృశ్యం నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో కవలలు నిత్యం గ్రామంలో కనిపిస్తూనే ఉంటారు. కవలల్లో ఒక సోదరుడు కన్పించిన కొద్ది సేపటికే మరో సోదరుడు కన్పిస్తే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతుంటారు. వాళ్లలో ప్రత్యేకంగా అన్న ఎవరో, తమ్ముడు ఎవరో కచ్చితంగా తెలుసుకోలేక తికమకపడుతుంటారు. ఒక్కోసారి కవలలిద్దరూ కలిసి కనిపిస్తే వాళ్లలో పెద్ద ఎవరో, చిన్న ఎవరో గుర్తుపట్టేందుకు కొద్దిసేపు తంటాలూ పడుతుంటారు. బుధవారం ఇంటర్నేషనల్ ‘ట్విన్స్ డే’ సందర్భంగా వేపకుంట్ల గ్రామంలో ఉన్న తొమ్మిది మంది కవల జంటను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
ఇద్దరి అభిరుచీ ఒక్కటే..
ఊహ తెలిసినప్పటి నుంచి ఒకే రకమైన అభిరుచితో పెరిగాం. కవలలమే అయినా ఐడెంటికల్ కాదు కాబట్టి అందరూ మా మధ్య గ్యాప్ ఉన్నట్లే భావించే వారు. మేం చెప్పే వరకు మేం కవలలమని తెలిసేది కాదు.
ఎప్పుడూ కలిసే ఉంటారు..
వేపకుంట్ల గ్రామానికి చెందిన గుగ్గిళ్ల సుధాకర్, కోటేశ్వరి దంపతులకు జన్మించిన ఈ కవలల పేరు రమ్య, లావణ్య. ‘వీళ్లు ఏం చేసినా కలిసే చేస్తారు. డ్రస్సులు, బ్రష్‌లు, పెన్నులు, చెప్పులు ఇలా అన్నీ ఒకే రకమైనవి ఎంచుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండరు. టీచర్ కావాలని రమ్య, ఇంజనీరు కావాలని లావణ్య కోరుకుంటున్నారు’ అంటూ మురిసిపోతున్నారు వీరి తల్లిదండ్రులు సుధాకర్, కోటీశ్వరి.
– గుగ్గిళ్ల రమ్య, లావణ్య, వేపకుంట్ల
ఈ నలుగురు ఒకే ఇంట్లో పుట్టిన కవలలు..
ఈ చిత్రంలో కనిపిస్తున్న కవలల పేర్లు అర్వికట్ల ప్రమోద్, ప్రదీప్, విజయ్ అజయ్. వీరు వేపకుంట్ల గ్రామానికి చెందిన కనకరాజు, రజిని దంపతుల కుమారులు. ప్రమోద్, ప్రదీప్‌లు మొదటి కాన్పులో ట్విన్స్. విజయ్, అజయ్‌లు రెండో కాన్పులోనూ టిన్స్గా జన్మించారు. ప్రస్తుతం మొదటి జంట డిగ్రీ చదువుతుండగా.. రెండో ట్విన్స్ ఇంటర్ చదువుతోంది. వీరు కవలలే అయినా ముఖచిత్రాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
– ఏ.ప్రమోద్, ప్రదీప్, అజయ్, విజయ్, వేపకుంట్ల
మొదట అందరూ ఆశ్చర్యపోయారు..
చూడడానికి మేమిద్దమూ ఒకేలా కనిపించే వాళ్లం. మొదటి పదేళ్ల వరకు మమల్ని చూసి మా ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయేవారు. చుట్టాలకైనా, టీచర్లకైనా ప్రతిసారీ కన్ఫ్యూజనే. మేం కూడా సరాదాగా కొత్త వాళ్లను సులభంగా ఆట పట్టించే వాళ్లం. మమ్మల్ని విడిగా చూసిన వాళ్లెవరూ కవలలు అనుకోరు. ఇద్దరమూ ఇకేసారి కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
– కే.సాయిరాం, కే.సాయికృష్ణ, వేపకుంట్ల
అల్లరి పిల్లలు ఈ కవలలు..
వేపకుంట్ల గ్రామానికి చెందిన మోతుకూరి శరత్‌కుమార్, స్వాతి దంపతుల కుమారుడు, కుమార్తెలైన సాత్విక్, సాత్వికలు అక్టోబర్ 15న రెండు నిమిషాల వ్యవధిలో జన్మించారు. ‘ఇద్దరూ ఒక్క క్షణమూ కుదురుగా ఉండరు. నిత్యం అల్లరి చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి వారిద్దరూ కొద్దిసేపు గొడవ చేసినా మాకు సంతోషంగానే ఉంటుంది. అందరితో ఎంతో కలివిడిగా ఉంటారు.’ అంటున్నారు వీరి పేరెంట్స్.
మాకు రోజంతా పండుగే..
వేపకుంట్ల గ్రామంలో బంధం శ్రీనివాసరావు, జ్యోతిలకు జన్మించిన వర్షిత, వర్షిణి వయస్సు ప్రస్తుతం రెండేళ్లు. తొలి కాన్పులోనే ఇద్దరు కుమార్తెలకు జన్మించడం ఆనందంగా ఉందంటున్నారు వీరి తల్లిదండ్రులు. ‘ఒకే రూపంతో ఉన్న మా చిన్నారులు చేసే అల్లరి, ఇద్దరి ఆటలు మాకు నిత్యం అపురూపంగా అనిపిస్తుంటాయి. వారి అల్లరి మాకు రోజంతా పండుగలాగే అనిపిస్తుంటుంది.’ అంటున్నారు వీరి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, జ్యోతి.
అలవాట్లు ఒకేలా ఉంటాయి..
కవలుగా పుట్టిన సూర్య, సరయు మోములు వేరైనా.. అలవాట్లు ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు టీటీ, శ్వేత చెబుతున్నారు. ‘ఒకరిని విడిచి ఒకరు ఉండేది లేదన్నట్లుగా ఉంటారు. తినే ఆహారం.. మాట్లాడే మాట వంటివన్నీఒకేలా ఉంటాయి. ఆలోచనలు సైతం అద్దంలా ఉంటాయి.’ అని చెబుతూ సంబురపడుతున్నారు వీరి తల్లిదండ్రులు టీటీ, శ్వేత.