కారేపల్లి, మార్చి 13 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ మహోత్సవం మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామి వారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి, అమ్మవార్లకు ఆభరణాలు పట్టు వస్త్రాలంకరణ చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యావాచనం, కంకణ ధారణ రక్షాబంధన్, పాదపక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కలాణ తంతును నడిపించారు.
భక్తుల గోవింద నామ స్మరణ మధ్య వేద పండితులు బి.వాసుదేవ శర్మ, దేవేంద్ర ధోని శర్మ,బొల్లోజు సతీష్ చార్యులు ఆధ్వర్యంలో కల్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాల ఘట్టం నిర్వహించారు. కల్యాణ పీటల మీద భక్తులు సురేందర్ మనియార్-వందన,నాగేశ్వరరావు- రేవతి,శ్రీనివాసరావు-అనురాధ దంపతులు కూర్చున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ నల్లమోతుల శేషయ్య, సహాయకుడు మూడు మోహన్-జ్యోతి, విగ్రహ దాత పెండ్యాల లక్ష్మీనారాయణ-నాగమణి తోపాటు గ్రామ పెద్దలు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు.