ఖమ్మం, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పండుగల సీజన్ వేళ కూరగాయల ధరలు పరేషాన్ చేస్తున్నాయి. ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు..’ అన్నట్లుగా దాదాపు అన్ని కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ధరలైతే చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు ఉద్యాన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినడం, ఫలితంగా వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
రూ.100 ఖర్చు చేస్తే ఒక్కరోజు కూడా సరిపడని పరిస్థితి. ఏటా కొత్త పంటలు చేతికొచ్చే సమయంలో కొంత మేరకు ధరలు పెరగడం సహజమే. అయినప్పటికీ నిరుటితో పోల్చుకుంటే ఈ ఏడాది ధరలు రెండు రెట్లు పెరిగాయి. సీజన్‌కు అనుగుణంగా ఒక రకం కూరగాయల ధరలు పెరిగితే.. మరో రకం కూరగాయల ధరలు తగ్గేవి. లేదా అదుపులో ఉండేవి. కానీ.. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలతోపాటు ఉల్లిగడ్డల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో ధర ఎక్కువైనా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ కూరను వండాలన్నా అందులో పచ్చి మిర్చి, టమాటా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు వీటి ధరలు కూడా అమాంతం పెరిగాయి.
ఖమ్మంలో మొత్తం నాలుగు రకాల మార్కెట్ సముదాయాలు ఉన్నాయి. వీటిలో మొదటిది హోల్‌సేల్ కూరగాయల మార్కెట్. దీనిలో ఏ రకం కూరగాయలు కొనాలన్నా కనీసం 10 కేజీలు కొనాల్సిందే. రెండోది రిటైల్ కూరగాయల మార్కెట్. దీనిలో కనీసం పట్టు(రెండున్నర కేజీలు) కొనాల్సి ఉంటుంది. మూడోది రైతుబజార్. ఇక్కడ పావు కేజీ నుంచి చిల్లరగా ఎన్ని కేజీల వరకైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక నాలుగోది కాలనీల్లో బడ్డీ కొట్లు, నాలుగు చక్రాల బండ్లు. ఇక్కడ కూడా పావు కేజీ నుంచి ఎంతైనా కొనొచ్చు. ప్రస్తుత మార్కెట్లో కూరగాయల ధరలు రెండింతలు పెరిగి ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలన్నీ నింగిని చూస్తున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ధరలు మాత్రం పోటీపడి పెరుగెత్తుతున్నాయి. సాధారణంగా వెలుల్లి ధర కేజీకి రూ.200కు మంచి ఉండదు. కానీ.. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.400కు పైబడి పలుకుతోంది. సాధారణంగా కేజీ ఉల్లి ధర కూడా రూ.20 నుంచి రూ.25 మధ్య ఉంటుంది. కానీ.. ప్రస్తుతం కేజీ రూ.70కి పైచిలుకే ఉంది. దీనికితోడు పప్పులు, మంచి నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో పండుగల వేళ నిత్యావసర సరుకుల ధరలను చూసి సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏం కొనాలన్నా ధరలు కొండెక్కి కన్పిస్తున్నాయి. ఈ ఆరు నెలల్లోనే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రేట్లు ఇంతలా పెరగడంతో కూరగాయలు కొనలేకపోతున్నాం. కొన్నిసార్లు పచ్చళ్లతోనే వెళ్లదీయాల్సి వస్తోంది.
-చింతపట్ల నాగలక్ష్మి, గృహిణి, ఖమ్మం
ఉల్లి లేకుండా ఏ కూరనూ చేయలేము. మార్కెట్లో ఉల్లి ధర రూ.65కి పైగా ఉంది. పెద్ద ఉల్లి గడ్డల ధర ఇంకా అంతకంటే ఎక్కువే చెబుతున్నారు. పెరిగిన ధరలతో ఉల్లిగడ్డలు కూడా కొనలేకపోతున్నాం. ఉల్లిగడ్డను సబ్సిడీపై అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందించాలి.
– ఆవుల పుష్పమ్మ, గృహిణి, ఖమ్మం