కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు మార్కెట్కు వెళ్లి ఆకు కూరలు, కూరగాయలు కొనాలంటే ధరలు దడ పుట్టిస్తున్నాయి. చికెన్ రేటుకన్నా కూరగాయల ధరలు మించిపోవడంతో ప్రజలు పచ్చి మిర్చి, టమాట కొనుక్కొని ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. కార్తీక మాసం వెళ్లినా కూరగాయల ధరలు మాత్రం తగ్గలేదు. మిజ్గాం తుపాన్ ప్రభావంతో కూరగాయల పంటలు దెబ్బతినడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు కొందరు చేసేది లేక పచ్చడి మెతుకులతోనే భోజనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి చలికాలంలో కూరగాయల ధరలు అందుబాటులో ఉండడంతో మార్కెట్లు, రైతు బజార్లు జనంతో కిటకిటలాడుతాయి. కొనుగోలుదారులతో సందడిగా ఉంటాయి. కానీ.. సంబంధిత శాఖ అధికారులు ధరల పెరుగుదలపై పట్టించుకోకపోవడంతో వ్యాపారులు రేట్లు పెంచి కూరగాయలను విక్రయిస్తున్నారు.
Vegetables | భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కార్తీకమాసం వెళ్లినా ఏమాత్రం తగ్గనేలేదు. ఆకుకూరలు, కూరగాయలు బాగా పిరమయ్యాయి. సామాన్య ప్రజానీకం కూరగాయలు కొనలేక పచ్చిమిర్చి, టమాట కొనుక్కొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. చికెన్ ధరలు కన్నా కూరగాయలు ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. చలికాలం వచ్చిందంటే కూరగాయల దుకాణాలు కిటకిటలాడాల్సింది పోయి మార్కెట్ అంతా వెలవెలబోతున్నది. కూలీ పనులు మీద ఆధారపడి బతుకుతున్న జనం చివరికి పచ్చడి మెతుకులతో గడపాల్సి వస్తున్నది. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు రేట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
ఒకప్పుడు మాసం తినాలంటే మనస్థాయి కాదులే అనుకునే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. చికెన్ కన్నా కూరగాయలు రేట్లు పెరిగిపోయాయి. దీంతో కోడికూరే మేలనుకుంటున్నారు. చికెన్ కిలో 120 రూపాయలు అయితే చిక్కుడుకాయలు కిలో 120 వరకు పలుకుతున్నది. దీంతో చిక్కుడుకాయల జోలికి వెళ్లడం లేదు. కార్తీక మాసంలో చికెన్ ధరలు కొంతమేర తగ్గినా మళ్లీ పెరుగుతున్నాయి. మటన్ ఎప్పటిలాగా కిలో 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. అధికారుల నియంత్రణ లేకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయని జనం ఆరోపిస్తున్నారు.
గత నెలరోజుల నుంచి కూరగాయలు, ఆకుకూరల ధరలు మరింత ప్రియమయ్యాయి. పాలకూర 20 రూపాయలకు నాలుగు కట్టలు అమ్ముతున్నారంటే ఆకుకూరలు ఎంత పిరం అయ్యాయో చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన తుపాన్ ప్రభావం వల్ల కూరగాయల తోటలు నేలకొరగడంతో అదే ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. కిలో ఉల్లి 60 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. కూలి పనులకు వెళ్లేవారు అన్నం వండుకుని పచ్చడి వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో మంచినూనె, సరుకులకు కూడా రేట్లు బాగా పెరగడంతో ఏం కొనేటట్లు లేదు అని జనం ఆవేదన చెందుతున్నారు.
కూరగాయలు తినే పరిస్థితి లేదు. ఇంత రేట్లు ఎప్పుడూ లేవు. టమాట, మిర్చి కొనుకెళ్లి పచ్చడి చేసుకుంటున్నాం. చిక్కుడుకాయలు రూ.120 పెట్టి సామాన్యులు తినలేరు. అరకిలో చికెన్ కొనుక్కోవడం మేలనిపిస్తుంది. షాపుల వద్ద జనం కూడా ఉండడం లేదు. వ్యాపారులను అడిగితే పైనే రేటు ఉందని చెబుతున్నారు.
మార్కెట్లో రేట్లు తక్కువ ఉంటాయని పల్లెటూరు నుంచి వచ్చాను. ఇంత రేటు చూసి ఏమీ కొనడం లేదు. ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు, ఆకుకూరలు కూడా రేట్లే ఉన్నాయి. పండ్లు అయితే అసలు కొనలేకపోతున్నాము. సీజన్ పోయినా రేట్లు మాత్రం తగ్గలేదు. సార్లు ఎవరూ పేదల గురించి పట్టించుకోరా..