పాల్వంచ, ఫిబ్రవరి 14 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(Six guarantees) తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ల ఉమ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న హైదరాబాద్ ఓంకార్ బిల్డింగ్లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో
గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
అనేక సంక్షేమ పథకాలను బుట్టదాఖలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లోటు బడ్జెట్ చూపిస్తూ కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటు వ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తున్నాయని విమర్శించారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు జిల్లా నాయకులు వీరమళ్ల మల్లయ్య, ఏఐకేఎంఎస్ SDLC నాయకులు చేరాలు, బుర్ర యాకయ్య, ప్రగతి శీల మహిళా సంఘం(POW) కొత్తగూడెం SDLC నాయకులు సోమ సుజాత, కళ్లెం నాగమ్మ సోమ వంశీ, జక్కుల గంగమ్మ, అల్లిపురం అరుణ, తదితరులు పాల్గొన్నారు.