ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ తీర్పుతో మాదిగలు చేసిన పోరాటం ఫలించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ ఆదినుంచీ కట్టుబడి ఉందని, వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో కృషి చేసిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గురువారం రవిచంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం నాటకాలు ఆడాయని, రాజకీయం చేశాయని, ఎస్సీలను మోసం చేశాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక న్యాయంలో భాగంగా చూసి సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. సుప్రీం తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.