– ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం, ఆగస్ట్ 25 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండారు నరసింహారావు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ఒకరోజుకే పరిమితం చేయకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చన్నారు.
ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మొక్కను నాటడం కంటే దాన్ని సంరక్షించడమే ముఖ్యమని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచితేనే వనమహోత్సవం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్క నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. మన గ్రామాలను పచ్చదనంతో నింపుదాం. హరిత గ్రామాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఖమ్మం వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ ఎం.ఎస్.ఎస్.శారదాదేవి, ఏపీఓ కె.నాగరాజు, ఏపీఎం హరినారాయణ, మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.