భద్రాచలం, డిసెంబర్ 24: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం రెండో రోజు రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకీ సర్పాన్ని తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారమూ లేక మందరగిరి పర్వతం సముద్రంలో మునిగి పోతుండగా దేవతలు, రాక్షసులు శ్రీహరిని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు ‘కూర్మావతారాన్ని’ ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై నిలిపి పైకెత్తాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శనిగ్రహ సంబంధమైన బాధలు తొలగుతాయని ప్రతీతి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీకృష్ణ పరమాత్మను, ఆండాళ్ తల్లిని, సీతారామ, లక్ష్మణమూర్తులను బేడా మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ద్రావిడ పాశురాలను విన్నవించారు.
అనంతరం శాత్తుమొరై, గోష్టి తదితర కార్యక్రమాలను నిర్వహించి ఆండాళ్ తల్లికి తిరువీధి సేవను జరిపారు. యాగవీర మూర్తులకు కూర్మావతారాన్ని అలంకరించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కూర్మావతారంలో ఉన్న రామయ్యను ప్రత్యేక పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాలు, మేళతాళాలు, వేద ఘోషలు, కోలాట నృత్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక వేదికపై ఆసీనులను చేయగా అక్కడ వేచి ఉన్న అశేష భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని రాజవీధిలో ఉన్న విశ్రాంత మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న భక్తులను స్వామివారు అనుగ్రహించారు. అనంతరం తాతగుడి సెంటర్ వద్దకు సకల రాజ లాంఛనాలతో తీసుకొని వెళ్లి భక్తుల దర్శనార్థం ఉంచారు. అక్కడ నుంచి స్వామివారిని ఆలయానికి తీసుకొని వెళ్లి మూలవరులకు సేవాకాలం జరిపారు. దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, ఏఈవోలు శ్రావణ్‌కుమార్, రామకృష్ణ, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పర్ణశాల ఆలయంలోనూ అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా స్వామివారు శనివారం కూర్మావతారంలో దర్శనమిచ్చారు. కాగా, మూడో రోజైన ఆదివారం స్వామివారు వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు.