ఖమ్మం, మార్చి 28: కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి డి.కుమారస్వామితో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం భేటీ అయ్యా రు. పార్లమెంట్లోని కేంద్రమంత్రి చాంబర్లో ఆయన్ని కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్దరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డునపడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రికి వివరించారు. ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చేనెల 2వ తేదీన ఢిల్లీ వస్తున్నదని, వారు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.