అశ్వారావుపేట, మే 18 : వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన గురువులు.. నాణ్యమైన విద్య.. ఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన ప్రాంగణాలు.. చూడచక్కని తరగతి గదులు.. మెనూ ప్రకారం పౌష్టికాహారం.. ఇవన్నీ నిరుపేద విద్యార్థినులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో అందుతున్న సౌకర్యాలు. విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ.. ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. వీటిలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దశలవారీగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లావ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా.. ఇప్పటివరకు 13 గురుకులాల్లో ఇంటర్ విద్య అందుతుంది. ఈ ఏడాది మిగిలి ఉన్న ఆళ్ళపల్లి కస్తూర్బాను కూడా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇక జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థినులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం 2011లో కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో 10వ తరగతి వరకే విద్య అందుబాటులో ఉండేది. ఇందులో 9 కేజీబీవీల్లో తెలుగు, మిగతా 5 (కొత్తగా అప్‌గ్రేడ్ అయిన ఆళ్ళపల్లితో కలిపి) ఇంగ్లిష్ మీడియం అమలులో ఉంది. కానీ.. తర్వాత కాలంలో తెలుగు మీడియం కేజీబీవీలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చింది. ఇప్పుడు అన్ని కేజీబీవీల్లో 10వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. అయితే మొదట తెలుగు మీడియంలో ఏర్పడిన కేజీబీవీల్లో ఇంటర్ విద్యను తెలుగు మీడియంలోనే అమలు చేస్తున్నారు.
జిల్లాలో కేజీబీవీలు ఇలా..
జిల్లావ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో చండ్రుగొండ, పాల్వంచ, పినపాక పాఠశాలలు 2018లో, చర్ల, దుమ్ముగూడెం, జూలూరుపాడు, గుండాల, ములకలపల్లి, టేకులపల్లి కేజీబీవీల్లో 2019లో ఇంటర్ విద్యకు ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. భద్రాచలం, బూర్గంపాడు కేజీబీవీలను 2021లో, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం కేజీబీవీలను 2022లో ఆప్‌గ్రేడ్ చేయగా.. మిగిలిన ఆళ్లపల్లి కేజీబీవీని 2023లో అప్‌గ్రేడ్ చేసింది. అన్ని కేజీబీవీల్లో రెండు జనరల్, ఒక ఒకేషనల్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీతోపాటు ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. స్థానిక విద్యార్థినుల ఆసక్తి మేరకు కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సుకు 40 మంది చొప్పున సీట్లు కేటాయించారు. ఆయా పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులతోపాటు కొత్త వారికి కూడా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలలోపు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.
తల్లిదండ్రుల సంతృప్తి
నిరుపేద విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం కేజీబీవీల ద్వారా ఉచిత విద్యను అందించడంతో విద్యార్థినులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించటమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాల్లో చదివించడం పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారం కావడంతో కేజీబీవీల్లో మంచి విద్యను అందిస్తుండటంతో చదివిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ స్థాయి విద్య
కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య కేజీబీవీల్లో అందుతున్నది. చదువుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవు. 10వ తరగతి వరకు ఇదే కేజీబీవీలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా ఇదే విద్యాలయంలో కొనసాగిస్తున్నాను. మా తల్లిదండ్రుల ఆశయం మేరకు మంచిగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే నమ్మకం ఉంది.
– ఎం.సునీత, సీనియర్ ఇంటర్, చండ్రుగొండ
ఈ ఏడాది నుంచి తరగతులు
ఈ ఏడాది ఆళ్ళపల్లి కేజీబీవీలో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇంటర్ విద్యార్థినులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ భవనంలో తాత్కాలికంగా విద్యాలయాన్ని నిర్వహిస్తున్నాం. కొత్త భవనం నిర్మాణంలో ఉంది. అతి త్వరలోనే నిర్మాణ పనులు పూర్తవుతాయి.
– వి. పద్మ, ఎస్వో, ఆళ్ళపల్లి
స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది
కేజీబీవీలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఒక్కో కోర్సులో 40 సీట్లు భర్తీ అయ్యే వరకు అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తాం. ప్రతీ కేజీబీవీలో రెండు జనరల్, ఒక ఒకేషనల్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థినులకు అన్ని మౌలిక సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం.
– కాంతకుమారి, స్పెషల్ ఆఫీసర్, చండ్రుగొండ