అంగన్వాడీ టీచర్లకు అప్‌గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే మూడునెలలు మెయిన్ టీచర్ల జీతం ఇచ్చి మళ్లీ పాత జీతంతోనే సరిపెడుతున్నది. దీంతో మినీ టీచర్లు గత 10 నెలలుగా పాత జీతాలతోనే సర్దుకోవాల్సి వస్తున్నది. మెయిన్ టీచర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితం లేకపోవడంతో రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీ టీచర్లు.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (నమస్తే తెలంగాణ)
అంగన్వాడీ మినీ టీచర్లకు ఉద్యోగోన్నతులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో ఇప్పటివరకు 1,434 అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు చిన్న గ్రామాలు, తండాల్లో మినీ సెంటర్లు ఉన్నాయి. మారుతున్న జనాభా దృష్ట్యా మినీ సెంటర్లను కూడా అప్‌గ్రేడ్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపాదన తీసుకొచ్చింది. అమలుచేసే క్రమంలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రతిపాదన మూలనపడింది. అయితే అంగన్వాడీ టీచర్ల పోరాటం ద్వారా మినీలను మెయిన్ చేస్తూ జీవో జారీ చేసింది. కానీ.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. జనవరిలో మినీలను మెయిన్ చేస్తూ వచ్చిన జీవోకు కేవలం మూడునెలలు మాత్రమే మినీ టీచర్లకు మొయిన్ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చారు. కానీ.. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మళ్లీ పాత జీతాలనే ఇస్తున్నారు. దీంతో యూనియన్ నాయకులు టీచర్లు కలిపి సీఎం, మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.
626 మందికి చేకూరని లబ్ధి
జిల్లావ్యాప్తంగా 626 మంది మినీ టీచర్లకు లబ్ధి చేకూరలేదు. మినీ టీచర్లకు రూ.7,500 రాగా, మెయిన్ టీచర్లకు రూ.13,500 వేతనం ఇస్తున్నారు. అప్‌గ్రేడ్ అయిన 626 మంది మందికి నేటికీ లబ్ధి చేకూరలేదు. దీంతో ఎప్పటిలాగా మినీ కేంద్రాల వలే పిల్లలకు వండిపెట్టడం వారివంతవుతుంది. దీంతో ఆయాల నియామకం కూడా నిలిచిపోయింది. పేరుకే అప్‌గ్రేడ్ చేసినా టీచర్లంతా పాత పద్ధతినే సెంటర్లను నడిపిస్తున్నారు. అంగన్వాడీ మెయిన్ టీచర్‌గా జాబితాలో పేరు ఉన్నా హెల్పర్ పనులు కూడా చేయాల్సి వస్తున్నది. మిగతా టీచర్లు పిల్లలకు విద్య నేర్పిస్తుంటే మినీ టీచర్లు పిల్లలకు వండిపెట్టడంతో సరిపోతున్నది.
పనులు బారెడు.. జీతాలు మూరెడు..
అంగన్వాడీలో టీచర్ల పరిస్థితి పనులు బారెడు.. జీతాలు మూరెడు అన్నట్లుగా ఉంది. ప్రతి సర్వే అంగన్వాడీ టీచర్ చేయాల్సిందే.. కానీ.. వారి బాగోగులు మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆదివారం కూడా డ్యూటీలు వేస్తుంటారు. తాగునీటి సమస్యపై కూడా అంగన్వాడీలే సర్వే చేయాలి. వైద్య శాఖ, కుటుంబ సమగ్ర సర్వే కూడా అంగన్వాడీలనే బాధ్యులను చేశారు. టీచర్లకు తోడుగా సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రతి పనికి ఒక యాప్ పెట్టడంతో.. యాప్‌లో వివరాలు అప్లోడ్ చేయడంతోనే కాలం సరిపోతున్నదని వారు వాపోతున్నారు.
పాత జీతాలే ఇస్తున్నారు..
ఎప్పుడో అప్‌గ్రేడ్ చేశారు. మూడంటే మూడు నెలలు మెయిన్ టీచర్‌తో సమానంగా జీతం ఇచ్చారు. తర్వాత 10 నెలలుగా పాత జీతాలే ఇస్తున్నారు. ఎవర్ని అడిగినా సమాధానం చెప్పడం లేదు. యూనియన్ నాయకులు పోరాటాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నా.. ఫలితం లేదు. ఎంతకాలం ఇలా చాకిరీ చేయాలి. పనులు ఎక్కువ.. జీతాలు తక్కువ. ప్రతి పనికి, సర్వేకు మమ్మల్నే పిలుస్తున్నారు.
– పాయం భానుశ్రీ, అంగన్వాడీ టీచర్, పాల్వంచ
అప్పుడూ ఇప్పుడూ అవే కష్టాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లపై చిన్నచూపు చూస్తున్నది. అదనపు పనులు చేయిస్తున్నారు.. వేతనాలు మాత్రం తక్కువగా ఇస్తున్నారు. మినీ టీచర్లను మెయిన్ చేసినప్పటికీ ఉపయోగం లేదు. జీతాలు పాతవే ఇస్తున్నారు.. మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తుందేమో.. ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధిస్తాం. సరైన జీతాలు లేకుండా ఎంతకాలం పని చేయాలి.
– మట్టా విజయశ్రీ, కే లక్ష్మీపురం, దుమ్ముగూడెం మండలం
ఫైనాన్షియల్ అప్రూవల్ రాలేదు..
మినీ టీచర్లను మెయిన్ చేసి ఏడాది అయ్యింది. గతంలో వారికి వేరే యాప్ ద్వారా జీతాలు చెల్లించేవారు. ఇప్పుడు మెయిన్ టీచర్‌లాగా జీతాలు ఇవ్వాలంటే సాంకేతిక సమస్య అడ్డుగా ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా రాలేదు. అందువల్ల జీతాలు ఆలస్యమవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి వారికి రెగ్యులర్‌గా జీతాలు వస్తాయి.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారి