మధిర, ఏప్రిల్ 09 : జీవనం కోసం ఉపాధి కలిగించే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.పురంధర్ అన్నారు. బుధవారం మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో మైనారిటీ సంఘాల సభ్యులకు రాజీవ్ యువ వికాస్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,50,000 కుటుంబాలు ఉన్నాయని, అర్హులు తప్పనిసరిగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉపాధి కల్పనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే వస్తుందో లేదో అన్న సందేహాలు ఎక్కువగా ఉన్నాయని, ఎటువంటి అపోహలకు పోకుండా ప్రతి ఇంట్లో ఒక దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ముస్లింలు, జైనులు, క్రిస్టియన్లు, కన్వర్ట్ క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21- 55 సంవత్సరాల మధ్య వయసు గలవారు, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు ఆదాయం కలిగి ఉండాలన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు అవగాహన కలిగి ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మండల పరిషత్ అధికారి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.