జూలూరుపాడు, మార్చి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామ సమీపంలో రహదారి పక్కన ఉన్న వాగు సమీపంలో వేస్తున్న వ్యర్ధాలతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు బాటసారులు సైతం ఆ వాగు దగ్గరకు వస్తే ముక్కు మూయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రామానికి చెందిన డంపింగ్ యార్డ్ ఉన్నా కొందరు చేపలు, కోళ్ల వ్యర్ధాలతో పాటు ఇళ్లలోని వ్యర్ధాలను బస్తాల్లో తెచ్చి రహదారి పక్కనే వేస్తుండడంతో వ్యర్ధాలు పేరుకుపోయాయి. వీటి నుండి వచ్చే దుర్గంధంతో ప్రయాణికులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కు తరలించి రహదారి పక్కన ఎవరూ వ్యర్ధాలు వేయకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.