ఖమ్మం సిటీ, నవంబర్ 10: జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జగతి అనే గర్భిణి శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పురుటి నొప్పులతో ఖమ్మం పెద్దాసుపత్రికి వచ్చింది. అమెను చేర్పించుకున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులు.. ప్రసవం జరిపించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పురుటి నొప్పులు భరించలేక బాధిత గర్భిణి రోదిస్తున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. బాధిత గర్భిణి ఎంత వేడుకున్నా.. సాధారణ కాన్పు జరగాల్సిందేనంటూ భీష్మించారు.
చివరికి ఆదివారం సాయంత్రం స్కానింగ్ సహా ఇతర పరీక్షల పేరుతో హడావిడి చేసి మృత శిశువును గర్భిణి, ఆమె బంధువుల చేతిలో పెట్టారు. దీంతో బాధిత గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దీంతో ఆగ్రహించిన వారి బంధువులు.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. యంత్రాంగం సర్దిచెప్పినా వారు సమ్మతించలేదు. కారుకులపై కేసు నమోదు చేయాలంటూ పట్టుబట్టారు. ఆదివారం రాత్రి వరకూ మృత శిశువును తీసుకెళ్లకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బాధిత గర్భిణి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో చావులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.