సారపాక, ఆగస్టు 25: చేపలు పట్టుకోవాలనే సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొన్నది. కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు మృత్యుఒడిలోకి చేరారు. ఈ విషాద ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం వద్ద సీతారామ కాలువలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన దంపతులు షేక్ జమీరుద్దీన్ (37) – షాహీన్. ఏపీలోని తెనాలికి చెందిన దంపతులు పర్వీన్ – కరీముల్లా. అయితే, షాహీన్, పర్వీన్ అక్కాచెళ్లుల్లు. కాగా, పర్వీన్ – కరీముల్లా దంపతులు తమ కుమారుడైన రియాజ్ (17)తో కలిసి రెండు నెలల క్రితం కొత్తగూడెం వచ్చి ఇక్కడే ఉంటున్నారు.
ఈ క్రమంలో జమీరుద్దీన్, తన తోడల్లుడి కుమారుడైన రియాజ్ కలిసి చేపలు పట్టేందుకు జింకలగూడెంలోని సీతారామ కాలువ వద్దకు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై చేరుకున్నారు. వాహనం పక్కన నిలిపి కాలువలో చేపలు పడుతున్నాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేశ్.. తన సిబ్బందితోపాటు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మధ్యాహ్నం సమయానికి జమీరుద్దీన్, రియాజ్ మృతదేహాలు లభ్యం కావడంతో వాటిని వెలికితీశారు.
రియాజ్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని విగతజీవులుగా ఉన్న జమీరుద్దీన్, రియాజ్‌లను కన్నీరుమున్నీరుగా విలపించారు. జమీరుద్దీన్‌కు భార్య షాహీనా, కుమార్తెలు ఈషా, షన్నాసిద్ధిక, ఉమర్ ఉన్నారు. రియాజ్ చదువుకునేందుకు వచ్చి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతడి తల్లిదండ్రులు పర్వీనా, కరీముల్లా సైతం రోదించిన తీరు కలిచివేసింది.
కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన జమీరుద్దీన్ మెకానిక్. ఖాళీ సమయాల్లో సరదా కోసం చేపలు పడుతుంటాడు. వేటలో పట్టిన చేపలను ఇంటి వద్ద చుట్టుపక్కల వారికి ఇచ్చి తృప్తి పడుతుంటాడు. ఆదివారం కావడంతో తన తోడల్లుడి కుమారుడైన రియాజ్ (వరసకు కొడుకు)ను తీసుకొని చేపలు పట్టేందుకు వచ్చాడు. చేపల కోసం వచ్చిన వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జింకలగూడెం వద్ద సీతారామ కాలువలో ఇద్దరు పడిపోయారన్న సమాచారం అందడంతో ఎస్ఐ రాజేశ్ తన సిబ్బందితో ఉదయమే హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బందితో మధ్యాహ్నం వరకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వేళ వారి మృతదేహాలు లభ్యం కావడంతో వాటిని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.