కారేపల్లి, జూలై 18 : తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రజలను నమ్మబలికి రూ.85.70 లక్షలు తీసుకుని పలువురిని మోసం చేసిన అంతరాష్ట్ర నేరగాళ్లను కామేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సింగరేణి సీఐ నునావత్ సాగర్ కేసు వివరాలను వెల్లడించారు. కామేపల్లి మండలం బాసీత్ నగర్‌కు చెందిన బానోత్ సాయికుమార్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నారాయణప్ప గురప్పను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితులు అమాయక ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, అతి తక్కువ ధరలకు భూములు, బంగారం ఇస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుండి కారు, మొబైల్ ఫోన్, నకిలీ ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల సమాచారం స్థానిక పోలీసులకు తెలుపాలన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన స్థానిక ఎస్ఐ, సిబ్బందిని ఆయన అభినందించారు.