భద్రాచలం, నవంబర్ 14 : గిరిజనులు, కొండరెడ్ల విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆభ భగవాన్ బిర్సాముండ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ట్రైకార్ జీఎం శంకర్రావు తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో యూనిట్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు.
గిరిజన విద్యార్థులకు వివిధ సంక్షేమ పథకాల అమలు, ఆశ్రమ, వసతి గృహాల్లో సంస్కృతీ సంప్రదాయలను నేర్పించడం ఈ పథకం కింద చేపడుతారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్రాజు, సుశీల్, ఏవో రాంబాబు, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.