మణుగూరు టౌన్, నవంబర్ 20: ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలో తొలుత డోలు కొమ్ములతో, ఆటపాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేశారు. తహసీల్దార్ నరేశ్‌కు వినతిప్రత్రం అందించారు. వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పిట్టల నాగమణి, బొల్లం రాజు, కొడిశాల రాములు, పాయ నరసింహారావు, కోండ్రు గౌరి, గుండి భీమయ్య, కుంజా రాజు, కారం భీమయ్య, గుంజ రాజా, బండారు సారిక, సంతోశ్, నందయ్య, రమేశ్ పాల్గొన్నారు.