Khammam | కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి(శాంతినగర్) ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 2004-2005 బ్యాచ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వారంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ స్థితిగతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాఠశాల ప్రాంగణంలో రోజంతా గడిపారు.
పదో తరగతి పాసై 20 సంవత్సరాలు గడవడంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని, విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని వారికి చదువులు నేర్పిన ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులంతా కలిసి మెమొంటోలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆనాటి ఉపాధ్యాయులు పోతన పోయిన ముత్తయ్య, జి.మాధవరావు, పూర్ణచందర్రావు, రంగయ్య, పెద్ద రమేష్ బాబు, అంజయ్య, జి వెంకటేశ్వర్లు, రంగయ్య, కరుణమై, ప్రఫుల్ల, ఉషారాణి, సత్యనారాయణ మాట్లాడుతూ తాము విద్యాబుద్ధులు నేర్పిన చిన్నారులు తమను గుర్తించుకోని ఈ ఆత్మీయ కలయిక వేడుకకు ఆహ్వానించి సత్కరించడం మరపురానిదన్నారు. ఈకార్యక్రమంలో 2004-2005 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు ఆవుల వెంకట్రావు, పృథ్వీరాజ్, ప్రసాద్, వీరకుమార్, హరిదాస్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.