రఘునాథపాలెం, అక్టోబర్ 9 : కార్యాలయంలో దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా వాహనదారులకు ప్రత్యేక అవగాహన ద్వారా వాటిని పూర్తి చేయాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రకాల ఫైళ్లను పరిశీలించారు. ముందుగా ఉద్యోగులు, సిబ్బంది కొరత తదితర అంశాల గురించి ఇన్చార్జి డీటీవో వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జిల్లా రవాణా శాఖ ఆదాయాన్ని 100 శాతం సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికిగాను 101 శాతాన్ని అధిగమించామని, ఎన్ఫోర్స్మెంట్ పెంచి మరింత ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పట్టుబడి ఏళ్లుగా తుప్పుపట్టిన వాహనాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏవో, సిబ్బంది పాల్గొన్నారు.