భద్రాద్రి కొత్తగూడెం, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కొత్త సర్కారు బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉద్యోగులు ఖాళీ స్థానాల వేటలో పడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని ఆలోచనలతో ఉద్యోగులు తంటాలు పడుతున్నారు. బదిలీల సమస్య ఈ విధంగా ఉంటే.. పిల్లల చదువుల కోసం ఇప్పటికే చెల్లించిన ఫీజుల సమస్య మరో విధంగా ఉంది. మరో వైపు 40 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బదిలీలకు అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించడంతో సీనియర్లకు మాత్రమే స్థానచలనం కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జోన్, మల్టీ జోన్, జిల్లా క్యాడర్ పరిధులలో ఉన్న ఉద్యోగులకు ఈ నెల 22 నాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం నుంచి అదేశాలు రావడంతో అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు బిజీ అయిపోయారు. దీంతో కొద్ది రోజులుగా అన్ని శాఖల ఉద్యోగుల జాబితాను తయారు చేసేందుకు ఆయా శాఖల యూడీసీలు కసరత్తు మొదలుపెట్టారు.
ఏటా వేసవిలో కౌన్సెలింగ్‌లు పూర్తి చేసి జూన్ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం ఆనవాయితీ. కానీ కొత్త సర్కారు.. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన సందర్భాన్ని, విద్యాసంవత్సరాన్ని చూడకుండా బదిలీల ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో ఉద్యోగులు ఇరకాటంలో పడ్డారు. తమ పిల్లలు పైచదువుల్లో ఉన్న ఉద్యోగులకు కొంతమేరకు ఊరట కలిగినా.. హైస్కూల్, ప్రైమరీస్థాయి పిల్లలున్న ఉద్యోగులు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి కాగా.. దాదాపు వందల పోస్టులు ఖాళీగా కనబడుతున్నాయి. దీంతో పాఠశాలల్లో టీచర్ల కొరత స్పష్టంగా కనబడుతోంది.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 12 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో కేవలం 40 శాతం మందికి మాత్రమే బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే టీచర్ల బదిలీలు పూర్తయ్యాయి. పోలీసు శాఖలో కూడా బదిలీలు అవుతున్నాయి. ఇతర శాఖల్లో మాత్రం ఈ నెల 22 కల్లా బదిలీలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులంతా ఆయా జిల్లా కార్యాలయాలకు వెళ్లి సర్వీసు రిజిస్టర్లతో పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు. ఆప్షన్ల ఫారాలను అందజేయాలని ఆదేశాలు రావడంతో ఫార్మాట్లో ఆప్షన్లు రాసి ఇస్తున్నారు.
బదిలీ అయ్యే అవకాశమున్న 40 శాతం మందిలోనూ ఒకేస్థానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులైనప్పటికీ ‘నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు తప్పనిసరి’ అనే నిబంధన పెట్టారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 40 శాతం మందికే బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బదిలీలు పారదర్శకంగా జరగాలి. సీనియారిటీ జాబితా ఆధారంగా ప్రక్రియ జరగాలి. ఆన్లైన్లో సమస్యలు వస్తున్నాయి. పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించి నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రతీ రెండేళ్లకోసారి బదిలీలు జరిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఏళ్లకేళ్లు ఒకేచోట పనిచేసిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా నిబంధనలు మారకూడదు. ఉద్యోగ సంఘాలతో సమీక్ష చేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. వేసవికాలంలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఇబ్బంది ఉండదు.