భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణా తరగతులను ప్రిసైడిండ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా సిబ్బందికి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. 26న రామచంద్ర ఆర్ట్స్ కాలేజీలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుందని, 27న రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుందని తెలిపారు. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం నంబర్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుందని, పోలింగ్ స్టేషన్లలో ఇచ్చిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాల్సి ఉంటుందని, ఇంకా ఇతరత్రా పనులకు దీనిని వినియోగించొద్దన్నారు. ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉంటే నమ్మకంతో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ట్రైనింగ్ నోడల్ అధికారి అలీం, పూసపాటి సాయికృష్ణ, కిరణ్కుమార్, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.