ఖమ్మం రూరల్, జులై 04 : ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీకి ఖమ్మం నగరం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కాలినడక మార్గమే గతి అవుతుందని ఎదులాపురం మున్సిపాలిటీ ప్రజలు వాపోతున్నారు. నాయుడుపేట కాల్వ ఒడ్డు మధ్యలో గల మున్నేరు ప్లైఓవర్ బ్రిడ్జిపై రెండు మూడు నెలలుగా తీగల వంతెన నిర్మాణంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మున్నేరు వాగు లోపల ఉన్నటువంటి పాత చాప్ట మీదుగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. చాప్ట లో లెవెల్ రహదారి కావడంతో రెండు రోజుల క్రితం కురిసిన ఓ మోస్తారు వర్షానికే చాప్ట పైనుంచి వరద నీరు రావడంతో ఉన్న ఒక్క రహదారి సైతం రాకపోకలకు అంతరాయం కలిగింది.
దీంతో ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు లోకల్ వాహనాల రద్దీ సైతం బైపాస్ రోడ్డుకు పాకడంతో గురువారం ఉదయం నుంచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. 24 గంటల్లోనే బైపాస్ రోడ్లో రెండు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. దీంతో బైపాస్ రోడ్డు సురక్షితం కాదని భావించిన ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని అనేక కాలనీల ప్రజలు ఖమ్మం మున్నేరు ఆగిపోయి ఉన్నటువంటి పాత బ్రిడ్జిపై నుంచి నడక దారిన రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఉదయం సాయంత్రం ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వివిధ అవసరాల నిమిత్తం ఖమ్మం నగరానికి నిత్యం వెళ్లే ప్రయాణికులు విధిలేని పరిస్థితుల్లో కాలి నడకన ఖమ్మం పోతున్న పరిస్థితి ఏర్పడింది.
ఆరోగ్యం బాగాలేక కొందరు, చంటి పిల్లలను సైతం సంకన వేసుకుని మరికొందరు కాలినడకన మార్గంలో వెళ్తున్నారు. మున్నేరు పాత చాప్ట చిన్నపాటి వర్షానికి వరద నీరు వస్తుందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం పట్ల రూరల్ మండల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మధ్యాహ్నం తర్వాత ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు కాలినడకన వచ్చే ప్రయాణికులను సైతం అడ్డుకోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నందున పాదచార్లను కూడా అనుమతించడం లేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం కాల్వ ఒడ్డు మున్నేరు పాత వంతెనపై రాకపోకలు పునరుద్ధరించాలని అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు కోరుతున్నారు.
Khammam Rural : ఖమ్మం పోవాలంటే కాలినడకే గతి