టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లింది. కొత్తతండా (జీ) గ్రామానికి చెందిన బానోత్ ఖీమాలాల్ మద్యం మత్తులో ట్రాక్టర్‌తో నడుపుతూ భూక్యా కల్యాణ్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. తడికలు అడ్డురావడంతో అది ఆగిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కొడుకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరో ఘటనలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతిచెందారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలంలోని మీనవోలు సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న మట్టి కుప్పను ఎక్కడంతో డ్రైవర్ కిందపడిపోయారు. దీంతో ట్రాలా అతనిపై నుంచి వెల్లడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్యగా గుర్తించారు. ఎర్రుపాలెం నుంచి మధిర వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.