ఇల్లెందు, ఫిబ్రవరి 16: ఉద్యమనేత కేసీఆర్తో తనది 24 ఏళ్ల అనుబంధమని చెప్పారు తెలంగాణ మలితరం ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్. కేసీఆర్ బంటుగా ఆదినుంచీ తాను రాష్ట్ర సాధకుడి బంటుగా కొనసాగుతున్నట్లు గుర్తుచేశారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి పుట్టిన రోజు సందర్భంగా ఉద్యమంలో ఆయనతో కలిసి నడిచిన దిండిగాల రాజేందర్ తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ అనుభవాలన్నీ ఆయన మాటల్లోనే.. ‘వలస పాలనలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైనా; నీళ్లు, నిధులు, నియామకాలపైనా కేసీఆర్ ఎంతో చలించిపోయారు.
2001 ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమవేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నేను హాజరై తొలిసారి కెసీఆర్ను కలుసుకున్నాను. మళ్లీ అదే నెల 27న అక్కడే సభ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు అదే సభలో కేసీఆర్ ప్రకటించారు. ఆయన పిలుపు మేరకు మే 11న ఉదయం 11 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాల్లోనూ టీఆర్ఎస్ నాయకులం గులాబీ జెండాలను ఎగరవేశాం. ఇల్లెందులో నేనూ ఎగురవేశాను. ఆనాటి నుంచీ ఆయనతోనే సాగుతున్నాను.
జీవితాంతమూ ఆయనతోనే సాగుతాను. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా కరీంనగర్లో సింహగర్జన పెట్టారు. దీనికి ఇల్లెందు నుంచి 12 జీపులు, 2 కార్లలో సుమారుగా 160 మందిమి బయలుదేరి వెళ్లాం. అప్పటి నుంచి ఆయన ప్రతి పిలుపునూ అనుకరిస్తున్నాను. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు తెలిపినందుకుగాను ఇల్లెందు పోలీసులు నన్ను, మరికొందరు ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఆ తరువాత కేసీఆర్, జేఏసీ పిలుపు మేరకు ఇల్లెందులో దీక్ష నిర్వహించడానికి పలు కుల సంఘాలు ముందుకొచ్చాయి. వారిలో ఇల్లెందుకు చెందిన కంచర్ల శ్రీను అనే కుల వృత్తి చేసే వ్యక్తి గొంతెత్తాడు. ‘తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న నాయకుల ఇళ్లలో పనులకు వెళ్లం’ అంటూ ప్రకటించాడు. ఇది రాష్ట్రంలో సంచలనమైంది.