e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home ఖమ్మం ఎయిడ్స్‌ భూతాన్ని తరిమేద్దాం

ఎయిడ్స్‌ భూతాన్ని తరిమేద్దాం

  • అవగాహనే అసలు మందు..
  • అప్రమత్తతతోనే వ్యాధి దూరం
  • ఖమ్మం జిల్లాలో 16,376, భద్రాద్రి జిల్లాలో 5,123 హెచ్‌ఐవీ కేసులు
  • నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం

కొత్తగూడెం, ఖమ్మం సిటీ, నవంబర్‌ 30;ఎయిడ్స్‌ అంతానికి స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, అధికారులు కంకణబద్ధులై పనిచేస్తున్నారు. విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా ఏటేటా హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. క్షణికానందమో.. మందులు అందుబాటులో ఉన్నాయనే ధీమానో తెలియదు కాని భయంకరమైన వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. కొందరు అవగాహన లేక దీని బారిన పడుతుండగా.. మరికొందరు నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబాలకు దూరం అవుతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 16,376 మందికి, భద్రాద్రి జిల్లాలో 5,123 మందికి హెచ్‌ఐవీ సోకింది. ఎయిడ్స్‌ నియంత్రణకు మందులు ఉన్నాయా! ఉంటే వాటిని ఎలా వాడాలి? పుట్టే బిడ్డకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? తదితర అంశాలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎయిడ్స్‌ బాధితుల సంఖ్య, నెలలవారీగా నమోదవుతున్న కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

ఖమ్మం జిల్లాలో నెలకు 35 పాజిటివ్‌ కేసులు
ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఎయిడ్స్‌ తీవ్రత తెలుస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 16,376 మందికి హెచ్‌ఐవీ సోకింది. ఇవి కేవలం ఖమ్మం పెద్దాసుపత్రిలో నమోదు చేసుకున్నవారి వివరాలు మాత్రమే. వారిలో ప్రతినెలా 6,027 మంది క్రమం తప్పకుండా మందులు తీసుకెళ్లి వాడుతున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం 2.306 మందికి ఆసరా పింఛన్‌ లు అందిస్తున్నది. జిల్లాలో ప్రతినెలా కొత్తగా సుమారు 35 మంది వ్యాధి బారిన పడుతున్నారని అధికారుల అంచ నా. వారిలో ఇద్దరు గర్భిణులు ఉండడం గమనార్హం. హైరిస్క్‌ కలిగిన వ్యక్తులు 2,075 మంది ఉండగా, ఫిమేల్‌ సెక్స్‌ వర్కర్స్‌ 1,450, స్వలింగ సంపర్కులు 568, ట్రాన్స్‌జెండర్స్‌-57 మంది ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు జిల్లాలో 28,027మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 249 మందికి పాజిటివ్‌గా తేలింది. గర్భిణులు 15,484 మందికి పరీక్షలు చేయగా 10 మంది బాధితులుగా తేలారు.

- Advertisement -

నాలుగో స్థానంలో ఖమ్మం జిల్లా..
ఎయిడ్స్‌ లేదా హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాప్తిలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, సత్తుపల్లి, మధిర హాస్పిటల్స్‌లో హెచ్‌ఐవీ నిర్ధారణ, వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నారు. వ్యాధిగ్రస్త గర్భిణులకూ ఖమ్మం పెద్దాసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కాన్పులు చేస్తున్నారు. హెచ్‌ఐవీ సోకిన వారికి ఆయా కేంద్రాల ద్వారా నెలవారీగా మందులు, ఆరు నెలలకు ఒకసారి సీడీ-4, ఏడాదికి ఒకదఫా వైరల్‌ లోడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త మార్పిడికి మొత్తం ఎనిమిది బ్లడ్‌ బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. జాగృతి స్వచ్ఛంద సంస్థ, జనవాణి స్వచ్ఛంద సంస్థ, లింక్‌ వర్కర్స్‌ ప్రోగ్రాం అనే సంస్థలు హెచ్‌ఐవీ ప్రబలకుండా యువతకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ వ్యాధిపై అవగాహన తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బీ మాలతి, జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ ప్రవీణ అన్నారు. సురక్షిత లైంగిక పద్ధతులను పాటిస్తే మహమ్మారి దరి చేరదని స్పష్టం చేశారు.

జిల్లాలో 5,123 హెచ్‌ఐవీ కేసులు
భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాల్లో ఎక్కువగా ఎయిడ్స్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఎంత అవగాహన కల్పించినా నెలకు 22 కేసులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,123 హెచ్‌ఐవీ కేసులున్నాయని అధికారులు గుర్తించారు. భద్రాచలం ఐఆర్‌టీ సెంటర్‌లో 2,306 మంది మందులు వాడుతున్నారు. ఇందులో 1,036 మంది ఆసరా పింఛన్‌ పొందుతున్నారు. ప్రలానెల 22 కొత్త కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇందులో గర్భిణిలూ ఉంటున్నారు. ఇప్పటివరకు హైరిస్క్‌ ప్రవర్తన కలిగిన వ్యక్తులు 8,440 మంది ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు జాగృతి, గాడ్‌థెరిసా, సెక్యూర్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఆరు ఐసీటీసీ కేంద్రాలు, 40 ఎస్‌ఐటీసీ కేంద్రాలు, ఏఆర్‌టీ కేంద్రాలు 1, లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు 4, సుఖవ్యాధి కేంద్రాలు 2, రక్తనిధి కేంద్రాలు 2 పని చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, అశ్వారావుపేటలో సేవలు అందిస్తున్నారు.

అవగాహన పెంచుకోవాలి
హెచ్‌ఐవీ అంటు వ్యాది కాదు. లైంగిక సంపర్కం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. రక్తమార్పిడితో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే హెచ్‌ఐవీ దరిచేరదు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అవగాహన కల్పిస్తున్నది.
-జేవీఎల్‌, డీఎంహెచ్‌వో

ప్రసవానికి వస్తే తప్పనిసరిగా పరీక్షలు
ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవాలకు వచ్చే జంటలకు హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తున్నారు. భర్తకు లేదా భార్యకు హెచ్‌ఐవీ సోకితే పుట్టబోయే, పుట్టిన బిడ్డకు రాకుండా మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు భద్రాద్రి జిల్లాలో పురుషులకు 38,551 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 155 (0.4శాతం) మంది పాజిటివ్‌గా నిర్దారించారు. ఇందులో గర్భిణులకు 15,863 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 6 (0.04శాతం) మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement