భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చెరగని ముద్ర వేశారు. అప్పుడు ఉద్యమంలో దూసుకుపోయిన ఆయన వెంట నడిచిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలామందే ఉన్నారు. 2002లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకాశం స్టేడియంలో పెట్టిన సభను సక్సెస్ చేసేందుకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి యువ నాయకులు ముందుండి నడిచారు.
తెలంగాణ పేరు చెబితేనే భయపడే ఈ ప్రాంతంలో జెండాలను భుజాన వేసుకుని ఉద్యమానికి ఊపిరిపోశారు. అదే సమయంలో సభకు వచ్చిన కేసీఆర్కు చేతికి విజయ చిహ్నంగా దట్టీని కట్టిన ఎండీ హుస్సేన్ నేటితరానికి ఉద్యమనేతగా నిలిచాడు. ఆయనతోపాటు తొగరు రాజశేఖర్, రాజుగౌడ్, మోరె భాస్కర్, పులి రామస్వామి సహా ఎంతోమంది ఉద్యమకారులు ఆనాడు కేసీఆర్ వెంట నడిచారు.
తొలిసారిగా కేసీఆర్ సిద్ధిపేట ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సైతం కొత్తగూడెం నుంచి ఉద్యమకారులు ఆయన గెలుపు కోసం వాల్రైటింగ్ కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ వంతెనలపై వాల్ రైటింగ్ రాసినందుకు పోలీసులు అరెస్టు కూడా చేశారు. తర్వాత కరీంనగర్ ఎన్నికలకు కూడా కొత్తగూడెం నుంచి ప్రచారానికి వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఉప్పల వెంకటరమణ నాయకత్వంలో కేసీఆర్కు అండగా నిలిచారు. తక్కువ మంది బలం ఉండడంతో కేసీఆర్తో ఎక్కువ సమయం గడిపారు.