సిరికల్యాణపు బొట్టును పెట్టి.. మణిభాసికమును నుదుటన గట్టి..
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ జయరామ జయ జయ రామ’ నామస్మరణలతో భద్రగిరి యావత్ మార్మోగింది.
- భద్రగిరిలో నేత్రపర్వంగా జగదభిరాముడి పరిణయ వేడుక
- మూడు మంగళసూత్రాలతో సీతమ్మకు మాంగళ్యధారణ
- పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం
- భద్రాచలంలో నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం
ఖమ్మం, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ జయరామ జయ జయ రామ’ నామస్మరణలతో భద్రగిరి యావత్ మార్మోగింది. ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి.. సిరి కల్యాణపు బొట్టును బెట్టి.. మణిభాసికమును నుదుటన గట్టి.. పారాణిని పాదాలకు పెట్టి..’ అంటూ భక్తులు తన్మయత్వం చెందారు. కల్యాణ ఘడియ కోసం రెండు రోజులుగా వీక్షిస్తున్న భక్తజనం.. పెండ్లి కుమారుడిగా రామయ్యను, పెండ్లికూతురు సీతమ్మను వివాహ వేదికపై దర్శించుకొని తరించారు. శిల్పకళా శోభితమైన మిథిలా కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది. ఉదయం 10:42 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:45 గంటల వరకు కొనసాగింది. 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల పరిణయ వేడుక భక్తజన కోటిని ఓలలాడించింది. పెండ్లికొడుకుగా శ్రీరామచంద్రుడు, పెండ్లి కుమార్తెగా సీతమ్మ తల్లి ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.
దేవాలయ అర్చకులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, నివేదన, షాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళశాసనాలు జరిపించారు. అనంతరం గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో ఆశీనులను గావించి భక్తుల కోలాహలం, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారామచంద్రస్వామివార్ల గొప్పతనాన్ని వర్ణిస్తూ సీతమ్మ తల్లి అణకువను విశదీకరిస్తూ కల్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది.
సీతారాముల కల్యాణ మహోత్సవ విశిష్టతను, భద్రాద్రి క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్తరామదాసు సేవలను, భక్తితో సీతారాములకు ఆయన చేయించిన ఆభరణాల చరిత్రను వేదపండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి కల్యాణం రోజు దేశంలో ఎక్కడైనా రెండు మంగళసూత్రాలను మాత్రమే ధరింపజేస్తారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో మాత్రం సీతమ్మ వారికి శ్రీరాముడు కట్టే పుస్తెల తాడులో మూడు సూత్రాలు ఉంటాయి. ఒకటి జనక మహారాజు, మరొకటి దశరథ మహారాజు చేయించినవి. భక్తరామదాసు సీతమ్మ తల్లిని తన కూతురుగా భావించి చేయించిన మూడో సూత్రాన్ని కలిపి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి మెడలో మాంగళ్యధారణ గావించారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన ముఖ్యమంత్రి
సీతారాముల కల్యాణ మహోత్సవంలో శ్రీరామచంద్రుడికి, సీతమ్మవారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, శృంగేరి శారదా పీఠం చినజీయర్ స్వామి, భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, తూము నరసింహదాసు వంశీయులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రముఖుల హాజరు..
జానకిరాముల కల్యాణ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, దేవస్థానం ఈవో దామోదరావు తదితరులు కల్యాణంలో పాల్గొన్నారు.
నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం..
భద్రాచల మిథిలాస్టేడియంలో శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవాన్ని శనివారం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం జరిగిన మిథిలా స్టేడియంలోనే మహాపట్టాభిషేకం భక్తుల సమక్షంలో నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై.. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

