ఖమ్మం, మే 3 : వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఆయా కేంద్రాల గేట్లు మూసివేస్తారు.
అభ్యర్థులందరూ మధ్యాహ్నం 1:30లోపే తమ తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https:// neet.nta.nic.in పోర్టల్ నుంచి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పోస్ట్‌కార్డు సైజు ఫొటో, ఫొటోతో కూడిన ఒరిజినల్ గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాప్పోర్టు) తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, శాంతినగర్ ప్రభుత్వ హైస్కూల్, ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ హైస్కూల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, రూరల్ మండలం కరుణగిరి సమీపంలోని కేంద్రీయ విద్యాలయం.