మహాశివరాత్రి పర్వదినం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించేందుకు ఆలయ కమిటీల బాధ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిషేక ప్రియుడైన మహాశివుడికి వందలాది లీటర్ల పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు చేయనున్నారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు. అన్ని ఆలయాల్లోనూ బుధ వారం రాత్రికి శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
కాకతీయుల శివభక్తికి తార్కాణంగా నిలిచిన కూసుమంచి శివాలయం, ఖమ్మం రూరల్ తీర్థాల సంగమేశ్వరాలయం, వైరా స్నానాల లక్ష్మీపురం శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం, బూ ర్గంప హాడ్ మోతె వీరభ ద్రస్వామి ఆలయం, చర్ల శ్రీఉమారామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీభద్రకాళీ వీరభద్రస్వామి ఆలయం, చుంచుపల్లి శివాలయం, పాల్వంచ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జూలూరుపాడు పాపకొల్లు శ్రీఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయం తదితర ఆలయాల్లో మహాశిరాత్రి వేడుకలను, శివపార్వతుల కల్యాణ ఘటాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. -నమస్తే తెలంగాణ నెట్వర్క్