‘జైజై గణేశా.. జై కొడతా..’ అంటూ వీధివీధినా విజ్ఞనాథుడి భక్తిగీతాలు మార్మోగనున్నాయి. ‘దండాలయ్యా ఉండ్రాల్లయ్యా.. దయుంచయ్యా దేవా..’ అంటూ ఏకదంతుడి చాలీషాలు ప్రజ్వరిల్లనున్నాయి. విఘ్నాలు తొలగించే విఘ్ననాథుడిని నవరాత్రులపాటు పూజించేందుకు ఉమ్మడి జిల్లాలోని భక్తులు, ఉత్సవ కమిటీల బాధ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భారతీయుల అతి ముఖ్య పండుగల్లో ఇది ఒకటి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
వేద పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల చతుర్థి అంటే ఈ నెల 6 (శుక్రవారం) మధ్యాహ్నం 3:01 గంటలకు తిథిన ప్రారంభమైంది. మరుసటి రోజు అంటే 7న (శనివారం) సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. అందుకని ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి ఈ నెల 7 శనివారం నుంచి ప్రారంభమవుతుంది. దీంతో శనివారం భక్తులందరూ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలను ఆరంభిస్తారు. వీధివీధినా వినాయక మంటపాలు ఏర్పాటుచేసి వాటిల్లో ఏకదంతుణ్ని కొలువుదీరుస్తారు. తొమ్మిది రోజులపాటు విశేషపూజలు చేస్తారు. వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, విగ్రహాలు, పత్రి తదితర విశిష్టతలపై ప్రత్యేక కథనం.
-ఖమ్మం/ కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 6
హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే మొట్టమొదటి పూజలు చేయాలి. వినాయక చవితి రోజున భక్తిశ్రద్ధలతో గణపతిని ఆరాధిస్త్తే కష్టాలు తొలగిపోతాయని, సుఖశాంతులు నెలకొంటాయని పురాణోక్తి. అందుకని భక్తులందరూ వీధివీధినా చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసి వాటిల్లో పార్వతీ పుత్రుడిని కొలువుదీర్చుతారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 40 వేల మండపాల్లో గణనాథులు కొలువుదీరనున్నట్లు అంచనా. వీటిల్లో 20 అడుగుల ఎత్తయిన విగ్రహాలూ ఉండడనున్నాయి.
18
వినాయకచవితి నాడు భక్తులు వేకువ జామునే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇళ్లను శుభ్రం చేసుకుని ద్వారాలకు మామిడి తోరణాలు కడతారు. పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు. పాలవెల్లి కట్టి దేవుడికి పీట వేస్తారు. పీటకు పసుపు, కుంకుమలతో బొట్లు పెడతారు. దానిపై గణపతి విగ్రహాన్ని నిలుపుతారు. కలశాన్ని నూతన వస్త్రంతో అలంకరించి గణపతికి ఆవాహన చేస్తారు. దీపారాధన చేస్తారు. ఫల పుష్ప పత్రాలతో పూజ చేస్తారు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, తెల్ల నువ్వులు కలిపిన మోదకాలు, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములను సమర్పిస్తారు.
శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సందడి కనిపించింది. గణపత్రి విగ్రహాలు, పత్రి, ఫలాలు కొనుగోలు చేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు కనిపించారు. గ్రామాల నుంచి సేకరించిన మారేడు, వాకుడు, గరికె, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మధుపం, సింధువారం, జాజీపత్రం, గండకి, శమి, రావి, మద్ది, తెల్లజిల్లేడు పత్రాలను విక్రయిస్తూ వ్యాపారులు కనిపించారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు భక్తులకు ఉచితంగా మట్టి గణపతులు అందించారు. ఖమ్మం నగరంలో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
ఖమ్మం, సెప్టెంబర్ 6: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సూచించారు. శనివారం వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ శుభాకాంక్షలు తెలిపారు. మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించి పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని కోరారు.