సిటీబ్యూరో, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని, ఇక్కడ గంగాజమునా తెహజీబ్ సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నా రు. నేరరహిత సమాజ స్థాపనలో పీస్ కమిటీ సభ్యు లు పోలీసులకు, ప్రజలకు మధ్య బలమైన వారధిలా నిలవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం సెంట్రల్ పీస్, వెల్ఫేర్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. రాబోయే పం డుగలను అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పీస్‌కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా సోషల్‌మీడియా వేదికగా మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించేలా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వచ్చే అసత్యప్రచారాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి పు కార్లను నమ్మకుండా ప్రజలకు వాస్తవాలను వివరించడంలో సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఇకపై మూడునెలలకోసారి జోనల్ స్థాయిలో విధిగా పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్‌డేవిస్, ఎస్ఎం విజయ్‌కుమార్, ఎన్.శ్వేత, పలు జోన్ల డీసీపీలు రక్షిత కృష్ణమూర్తి, ఖరే కిరణ్ ప్రభాకర్, శిల్పవల్లి, రమణారెడ్డి, రాజేశ్, చంద్రమోహన్, శ్రీనివాస్, రాహుల్‌హెగ్డే, కాజల్, అవినాశ్కుమార్లతో పాటు సెంట్రల్ పీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిషన్ శర్మ, వివిధ జోన్ల అధ్యక్షులు శవశికాంత్ అగర్వాల్, ఖాజా అబ్దుల్ మోయిజ్, ఖాజాగాజియుద్దీన్, మౌజంఅలీ, తేజో విజయకుమారి, శశికాంత్ అగర్వాల్, నారాయణరెడ్డి, ఉపేందర్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.