ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్, జూన్ 18: ‘వానరాలు అడవులకు తిరిగి వెళ్లాలి. వానలు వాపస్ రావాలి’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చిన నాటి హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకంతో ప్రతి గ్రామం, పట్టణం మొక్కలు పెంపకం ప్రారంభమైంది. గ్రామగ్రామానికి నర్సరీలు వచ్చాయి. ఇప్పుడు ఊరూవాడా అంతా పచ్చందాలు పరచుకున్నాయి. ఇంటింటికీ మొక్కలు ఉచితంగా మొక్కలు అందించడంతో ప్రతి ఇల్లు పొదరిల్లు అయింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలోనూ ఇప్పుడు ప్రజలు మొక్కలు బహుమతులు ఇచ్చే సంస్కృతి వచ్చిందిప్పుడు. తొలినాళ్లలో అధికారులు మండల కేంద్రాల్లో నర్సరీలు నిర్వహించే హరితహారం కోసం మొక్కలు పెంచారు. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చాక ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. పాలకవర్గం 10 శాతం నిధులను హరితహారానికి ఖర్చు పెట్టేలా సీఎం కేసీఆర్ చట్టాన్ని రూపొందించారు.
పెరుగుతున్న మొక్కలు ఇవీ..
వెదురు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి, ఖర్జూరం, నిద్ర గన్నేరు, మల్బరు వేప, గానుగ, వేప, కదంబ, గుల్మొహర్, మారేడు, స్పాంథోడియా, కరివేపాకు, గోరింట, ఉసిరి, చింత, రేగు, ఈత, నేరేడుతో పాటు ఇతర మొక్కలు పెరుగుతున్నాయి. ఇవే కాక అంతరించిపోతున్న టేకు వృక్షజాతికీ ప్రాముఖ్యత ఉన్నది. ఈ మొక్కలు ప్రకృతి వనాలు, పార్క్‌లు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాలు, కాలువలు, రహదారుల పక్కన, డివైడర్ల మధ్య పెరుగుతున్నాయి. సర్కార్ నిర్దేశించిన విధంగా అన్ని ప్రభుత్వశాఖలు తమకు కేటాయించిన స్థలాల్లో మొక్కలు నాటిస్తున్నాయి. ప్రస్తుతం అటవీశాఖ, డీఆర్డీఏ, మున్సిపాలిటీ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు పెరుగుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో మొక్కల పెంపకం ఇలా..
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్లలో 545.97 ఎకరాల విస్తీర్ణంలో సర్కార్ 1.60 లక్షల మొక్కలు నాటించింది. ఇప్పుడా ప్రదేశం పర్యాటక ప్రాంతంగా మారింది. సత్తుపల్లి పట్టణంలో 271.81 ఎకరాల విస్తీర్ణంలో నీలాద్రి అర్బన్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. పార్క్‌లో 1.64 లక్షలు పెరుగుతున్నాయి. హరిత నిధి పథకంలో భాగంగా తల్లాడ రేంజీ గూడూరు సెంట్రల్ నర్సరీలో అటవీశాఖ భారీగా మొక్కలు పెంచుతున్నది. రహదారుల వెంట 67 కిలోమీటర్ల పొడవునా మొక్కలు పెంచుతున్నది. 9వ విడత హరితహారానికి అధికారులు 7.74 లక్షల మొక్కలను సిద్ధం చేశారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా అధికారులు 2015లో 1.16 కోట్ల మొక్కలు, 2016లో 1.61 కోట్లు, 2017లో 1.63 కోట్లు, 2018లో 96 లక్షలు, 2019లో 1.46 కోట్లు, 2020లో 1.60 కోట్లు, 2021లో 1.35 కోట్లు, 2022లో 1.15 కోట్ల మొక్కలు నాటారు. ఇలా ఎనిమిది విడతల్లో 10 కోట్లకు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 481 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెరుగుతున్నాయి. తొమ్మిదో విడత హరితహారానికి అధికారులు 65 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతి పంచాయతీలో పచ్చదనం..
హరితహారం మొక్కలు పెంచేందుకు జిల్లాలోని ప్రతి పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేశాం. హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా విరివిగా మొక్కలు నాటించాం. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో సుమారు 10 కోట్లకు పైగా మొక్కలు నాటించి వాటిని సంరక్షిస్తున్నాం.
– జి.మధుసూదనరాజు, డీఆర్డీఏ, భద్రాద్రి కొత్తగూడెం