‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. ‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’ అన్నారో కవి. ‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే సృష్టే లేదు’ అంటూ ‘ఆమె’కున్న పరమార్థాన్ని విశదీకరించారాయన. వాస్తవంలోనూ అదే బోధపడుతోంది. ఆత్మవిశ్వాసంతో అడుగు వేసి అన్నింటా రాణిస్తూ సాధికారత వైపు సాగిపోతోంది. ఇందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళా సంక్షేమానికి, సాధికారతకు అగ్రతాంబూలం వేస్తోంది.
ఖమ్మం కల్చరల్/ పెనుబల్లి/ భద్రాచలం/ చింతకాని, మార్చి 7: అప్పుడే పుట్టిన ఆడపిల్లకు కేసీఆర్ కిట్ ద్వారా అందించే పారితోషికం, యువతులకు వివాహ సమయంలో అందించే లాంఛనాలు వంటి వాటి నుంచి వృద్ధాప్యంలో చేయూతనిచ్చే ఆసరా పింఛన్ల వరకూ అన్ని సౌకర్యాలనూ కల్పిస్తూ ఆడబిడ్డలను అక్కున చేర్చుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. బాలికల విద్యాభ్యాసం కోసం గురుకులాలు ఏర్పాటు చేసే అంశం అన్ని రకాల ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించే అంశం వరకూ సమస్త విభాగాల్లోనూ ప్రోత్సహిస్తోంది. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో విశేష ప్రతిభ చూపిన మహిళలు, వారు ఉన్నత స్థానానికి ఎదిగిన తీరు, ప్రభుత్వం అందించిన సహకారం, వాటిని వారు సద్వినియోగం చేసుకున్న విధానం వంటి అంశాల సమ్మిళితం.. ‘నమస్తే తెలంగాణ’ కథనం..
పని దినాల కోసం, పురుషులతో సమానమైన వేతనాల కోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో ఎగిసిన మహిళా గళం.. ఆ తర్వాత పురుషుల ఆధిపత్యాన్ని ప్రశ్నించేస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుకుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహిళా గళం కేవలం పురుషులతో సమాన వేతనం వంటి వాటి కోసమే గాక లింగ, జాతి వివక్షపైనా, ఆస్తి, విద్య, ఓటు వంటి హక్కులపైనా పెల్లుబికింది. దేశంలో మొదటిసారిగా 1943 మార్చి 8న ముంబైలో బొంబాయి – సోవియట్ యూనియన్ మిత్ర మండలి మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. తరువాత 1970 దశకంలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, నిర్బంధాలు.. స్త్రీవాద ఉద్యమాలకు నాంది పలికాయి. 1975వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగానూ ప్రకటించింది. ఈ క్రమంలోనే మన దేశంలోనూ ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుగుతోంది.
ఖమ్మానికి చెందిన ఏలూరి మీనా శాస్త్రీయ నృత్యకారిణిగా ఎన్నో రాష్ట్ర, జాతీయ అవార్డులు సాధించింది. నగరంలో నృత్యాలయం స్థాపించి శాస్త్రీయ నృత్యంలో ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తోంది. చిన్న వయసు నుంచే నర్తకిగా రాణిస్తూ ఖమ్మం శాస్త్రీయ నృత్య కళకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. జాతీయస్థాయిలో 40, రాష్ట్రస్థాయిలో 100, జిల్లాస్థాయిలో 150 బహుమతులు సాధించింది. రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌లో, ఖమ్మం చిల్డ్రన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనలిచ్చి నాట్యాచార్యుల ప్రశంసలందుకుంది. కళాతపస్వి, దర్శకుడు కే.విశ్వనాథ్ నుంచి సత్కారం, ప్రశంస అందుకోవడం తనకు మరపురాని జ్ఞాపకమంటోంది నృత్యకారిణి మీనా. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో ఇప్పటి వరకు ఆమె 20 బంగారు పతకాలు సాధించడం విశేషం.
కడుపున పుట్టిన వారే కాదు పొమ్మంటుంటే.. తనకు ఏమీ కాని వారి కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది ఓ అమ్మ. ఆమె.. సరోజనమ్మ. ఎందరో అనాథలకు మాతృమూర్తిగా మారి సపర్యలు చేస్తోంది. ఆకలి తీరుస్తోంది. తనకు వచ్చే చిన్న వేతనంతోనే అనాథలను అక్కున చేర్చుకుంటోంది. ఆఖరికి అన్నీ తానై అంతిమ సంస్కారాలూ చేస్తోంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న సరోజనమ్మ.. 2007లో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఎటపాకలో అద్దె ఇంట్లోనే ‘సరోజిని వృద్ధాశ్రమం’ ఏర్పాటు చేసి అభాగ్యులకు ఆశ్రయం కల్పించింది. కూనవరం రోడ్డులోని మానవసేవ వలంటరీ ఆర్గనైజేషన్ పేరుతో మరో ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. సుమారు 200 మందికి పైగా వృద్ధులను చేరదీసి ఈ రెండు ఆశ్రమాల్లో ఆశ్రయం కల్పించి సేవలందిస్తోంది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో వారి కోసం రాష్ట ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి. మహిళల ఆర్థిక వెసులుబాటుకు ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు తెలంగాణ ఆడబిడ్డలకు వరం. ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్ల ఏర్పాటుతో మహిళలకు ప్రోత్సాహమివ్వడం విద్యార్థినుల అదృష్టం.
-కే.రమాకల్యాణి, గురుకుల ప్రిన్సిపాల్, తిరుమలాయపాలెం
చింతకాని మండలం నాగులవంచ నుంచి టీజీవోస్ అధ్యక్షురాలిగా, జీహెచ్ఎంసీలో స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌గా ఎదిగారు వంకాయలపాటి మమత. పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వంకాయలపాటి వెంకటనర్సయ్య, విమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారుల అనంతరం జన్మించిన ఈమె.. ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు స్వగ్రామమైన నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తదుపరి విద్యాభ్యాసం ఖమ్మం, హైదరాబాద్‌ల్లో పూర్తయింది. 1992 గ్రూప్ 2 సర్వీసెస్‌లో సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధుల్లో చేరిన ఆమె.. అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. స్వరాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల తరఫున ఉధృతంగా పోరాడారు. అనేకసార్లు జైలుకూ వెళ్లారు. ఇప్పుడు టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోనూ ముందుంటున్నారు.
తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా ఉద్యోగోన్నతి సాధించిన ఘనత పొందారు షేక్ సలీమా. ఆమె తండ్రి లాల్‌బహదూర్ ఖమ్మం జిల్లాలో ఎస్సైగా రిటైరయ్యారు. ఆమె స్వగ్రామం చింతకాని మండలం కోమట్లగూడెం. 2007లో డీఎస్పీగా ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పోస్టింగ్ పొందిన ఆమె.. అంబర్‌పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)గా మాదాపూర్‌లో పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా విధులు నిర్వర్తిస్త్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్ ఉద్యోగోన్నతి జాబితాలో సలీమా తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌గా రికార్డు దక్కించుకున్నారు. కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చంటూ యువతకు సందేశమిస్తున్నారు సలీమా.
తనను నమ్మి అధికారాన్ని అందించిన ఆ ఊరి ప్రజల అభిమానాన్ని చూరగొన్నది ఆ మహిళా సర్పంచ్. ఆమే పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి. గ్రామాభివృద్ధికి కంకణబద్ధురాలైన ఆమె.. తన విశిష్ట పనితీరుతో ముఖ్యమంత్రి మన్ననలూ అందుకుంది. పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రశంసలు పొందింది. శివుడు, కాటికాపరి విగ్రహాలతోపాటు.. బోరు, సుందరమైన పూలమొక్కలు వంటివి ఏర్పాటు చేసి వైకుంఠధామం ప్రకృతినిలయం తీర్చిదిద్దింది. ఆ వైకుంఠధామాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఏకంగా అసెంబ్లీలోనే దానిని ప్రదర్శించడం, సర్పంచ్‌ను ప్రశంసించడం అభినందనీయం.
ఖమ్మంలోని ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మహ్మద్ ఫర్హా.. మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుని జిల్లా కీర్తిని ఖండాంతరాలు దాటించింది. వివాహితురాలై, ఇద్దరు పిల్లలకు మాతృమూర్తి అయి కూడా ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో జరిగిన పోటీలో అందం, ప్రతిభలతో రాణిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. మిసెస్ యూనివర్స్‌గా, మిసెస్ ఇండియాగా ఆమె టైటిల్‌ను గెల్చుకోవడంతోపాటు మిసెస్ ఫొటోజెనిక్ అవార్డు, ఎఫ్ఎస్ఐ అవార్డు, సూపర్ ఉమెన్ ఆవార్డు సాధించింది. మహిళా సాధికారత, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సేవల్లో ముందుంటున్న ఆమె.. వరల్డ్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ మిషన్ తెలంగాణ రాష్ర్టానికి కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.