భద్రాచలం/చర్ల, జూన్ 19 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్రస్తుత వర్షాకాలం సీజన్లో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్, ఇన్చార్జ్ పీవో జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఇళ్ల నుంచి ఆశ్రమ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులను గమనించాలని హెచ్ఎంలు, వార్డెన్లకు సూచించారు. వాతావరణ మార్పులతో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్ కావడంతో పిల్లలు రాత్రిపూట బయటకు వెళ్లకుండా చూడాలన్నారు.
పాఠశాల నిర్వహణ తీరు బాగున్నదని, ప్రతి రోజు ఇలాగే పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం చర్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ ముంపు గ్రామం దండుపేట సమీపంలోని తాలిపేరు వంతెన వద్ద పరిశీలించారు. వరద పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించే తేగడ రైతు వేదిక భవనం వద్ద ఆగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవరపల్లిలోని ఆదర్శ పాఠశాలను సందర్శించి.. ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో దామోదర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీవో నరసింహారావు, తహసీల్దార్లు శ్రీనివాస్, మొగిలి శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం సుభద్ర, సీడీపీవో చైతన్య, ఆర్ఐ వరలక్ష్మి, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.