కొత్తగూడెం గణేశ్ టెంపుల్, మే 27: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఐడీవోసీలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని, ఇందుకోసం జిల్లా ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మొత్తం 1,367 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్, ఐదుగురు సిట్టింగ్ స్కాడ్, 50 మంది ఇన్విజిలేటర్లను నియమించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వరాచారి, జిల్లా వైద్యాధికారి భాస్కర్నాయక్, విద్యుత్, పోస్టల్, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.