– రేండున్నర ఏండ్లు కావస్తున్నా పట్టించుకోని కాంట్రాక్టర్లు
– అవస్థలు పడుతున్న గ్రామస్తులు
కరకగూడెం, మే 06 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూరుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులను కలుపుతూ గ్రామాలకు బీటీ రహదారులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేసి అనేక రహదారులను నిర్మించింది. ఈ క్రమంలో 2023లో కరకగూడెం మండలం అల్లేరుగూడెం గ్రామం నుండి బర్లగూడెం గ్రామాన్ని కలుపుతూ పంచాయతీ రాజ్ నిధుల నుండి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.26 కోట్లు, అలాగే రేగుళ్ల క్రాస్ రోడ్డు నుండి తుమ్మలగూడెం గ్రామానికి ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల నుండి రూ.30 లక్షలు అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో నిధులు మంజూరు చేయించి రహదారుల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అయితే కంకర పోసి పనులు శరవేగంగా నడుస్తున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రోడ్డు నిర్మాణాల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నర ఏండ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్లు బీటీ వేయకుండా అలాగే వదిలేయడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్రవాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. పెద్దపెద్ద గుంతలు పడి రహదారులు ప్రమాదాలకు నెలవులుగా మారాయి.
రహదారి పనులు ఎందుకు జరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత కాంట్రాక్టర్ను అడిగితే బిల్లులు రాకపోవడంతో రహదారి వేయలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. రాత్రి వేళల్లో రహదారిపై ప్రమాదకరంగా కంకర తేలి ఉండటంతో ఎన్నో అవస్థలు పడుతున్నామని దుయ్యబట్టారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు నడిపేవారు ప్రయాణం చేయాలంటే భయం గుప్పిట్లో నడపవలసి వస్తుందని వాపోతున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ రాజ్ ఏఈ వినిత్ను వివరణ కోరగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.

అధ్వానంగా తుమ్మలగూడెం- బర్లగూడెం రహదారి
రేగుళ్ల క్రాస్ వద్ద నుండి తుమ్మలగూడెం గ్రామానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి రహదారి పనులు ప్రారంభించి కంకరవేశారు. ఆయితే ఆసెంబ్లీ ఎన్నికల అనంతరం రెండున్నర ఏండ్లు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ బీటీ వేయలేదు. ఈ రహదారిపై వెళ్లాలంటే నరకం కనపడుతుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికారులు బీటీ వేసి రహదారిని ఏర్పాటు చేయాలి.
రఘనాథపాలెం పంచాయతీ బర్లగూడెం నుండి ఆల్లేరుగూడెం గ్రామాన్ని కలుపుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో రూ.2.26 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. 2023లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు ఆర్ధాంతంగా నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయి. దీంతో రహదారిపై కంకర తేలి ప్రమాదకరంగా మారడంతో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. టైర్లు తరుచూ పంక్చరై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రహదారిపై ప్రయాణం గ్రామాలలోని ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఆధికారులు చొరవ తీసుకుని రహదారి పనులను పూర్తి చేయాలి.

అధ్వానంగా తుమ్మలగూడెం- బర్లగూడెం రహదారి