భద్రాచలం, ఏప్రిల్ 4: భద్రాచలం రామయ్య కల్యాణం దేశానికే తలమానికమని.. అలాంటి రాముడి కల్యాణానికి రాష్ర్టాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు సంబంధించి 48 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారంతా మనస్సు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ఇప్పటికే అందుకు అనుగుణంగా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదరరావు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందుగా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించి పనులను పర్యవేక్షించారు. కరకట్ట పనులు నిలిపివేయడంతో పాటు పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయని మంత్రి తుమ్మల వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణను ఆసుపత్రి విషయమై ప్రశ్నించగా కొత్తగా వైద్యులు వచ్చారని, వారికి అవగాహన లేనికారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని అవి మళ్లీ జరుగకుండా చూస్తున్నామని వివరించారు.