వైరా టౌన్/ తల్లాడ, ఏప్రిల్ 6: ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై జరిగిన ఇంకో ప్రమాదంలోనూ ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మృతుల్లో రాజమండ్రికి చెందిన దంపతులున్నారు. వారి కొడుకుతోపాటు లారీ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనలో క్లీనర్ మృత్యువాతపడ్డాడు.
ఏపీలోని రాజమండ్రికి చెందిన ఉండమట్ల వీర్రాజు (46), వీర శ్రీలత (40) అనే దంపతులు వారి కుమారుడు యశ్వంత్‌తో కలిసి వారి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నెస్పీ కాలువపై ఇరుకైన వంతెన ఉంది. సరిగ్గా ఆ వంతెనపైకి వచ్చే సరికి వీర్రాజు కారు తన ముందున్న లారీని ఓవర్టేక్ చేయబోయింది. అదే సమయంలో ఎదురుగా మరోలారీ వేగంగా వచ్చింది. దానిని తప్పించుకునేందుకు వీర్రాజు తన కారును తాను ఓవర్టేక్ చేస్తున్న లారీ యొక్క ముందు, వెనుక టైర్ల మధ్యలోకి పోనిచ్చాడు. అయినప్పటికీ ఎదురుగా వచ్చిన లారీ వేగంగా వీర్రాజు కారును ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య వీర్రాజు కారు భారీగా ధ్వంసమైంది. అందులో ముందు భాగంలో ఉన్న వీర్రాజు, అతడి భార్య వీర శ్రీలత, వెనుక కూర్చున్న వారి కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీర్రాజు, వీర శ్రీలత దంపతులు చికిత్స పొందుతూ మృతిచెందారు. వారి కుమారుడు యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక, ఎదురుగా వచ్చి వీరి కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ కూడా క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసుల కలిసి జేసీబీ సాయంతో ఆ లారీ నుంచి డ్రైవర్ అలుబోలు శ్రీనును కూడా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే, ఈ ప్రమాదం సరిగ్గా ఎన్నెస్పీ వంతెనపై జరగడంతో; రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోవడంతో, అన్ని కలిసి వంతెనపై అడ్డుగా పడడంతో ఖమం వైరా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు జేసీబీ యంత్రాలను తెచ్చి ఆయా వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై ఎస్ఐ సూరజ్ కేసు నమోదు చేశారు.
ధాన్యాన్ని లోడ్ చేసుకొని అర కిలోమీటరు కూడా ప్రయాణించకముందే లారీ బోల్తా కట్టి క్లీనర్ మృతిచెందిన ఘటన ఇదే ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో సోమవారం తెల్లవారుజామున ఒంటిగంటకు జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తల్లాడ మండలం వెంగన్నపేట గ్రామంలో ఓ లారీ ధాన్యాన్ని లోడ్ చేసుకుంది. రాజమండ్రికి బయలుదేరింది. అర కిలోమీటరు ప్రయాణించాక గూడూరు – మిట్టపల్లి మధ్య వంతెన వచ్చింది. అక్కడ నూతన వంతెన నిర్మాణంలో ఉండడంతో ఆ పక్కనే వాగుపై నుంచి చప్టా మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఈ లారీ కూడా చప్టా మీద నుంచే వెళ్తోంది. చట్టా మధ్యకు వచ్చే సరికి ఎదురుగా మరో వాహనం వచ్చింది. ఆ వాహన వెలుతురుకు చప్టా దిగువ భాగం ధాన్యం లారీ డ్రైవర్‌కు కన్పించకపోవడంతో తన లారీని దిగువ భాగం వైపు పోనిచ్చాడు. అక్కడ రోడ్డు లేకపోవడంతో వాగులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మడక బోగేశ్వరరావు (38) అకడికకడే మృతిచెందాడు. అయితే, ఈ లారీ డ్రైవర్ సాలెపు సంతోశ్‌కుమార్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు బోగేశ్వరరావును ఏపీలోని అనకాపల్లి జిల్లా మడకపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలైన ఘటనా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని తుని నుంచి ఖమ్మానికి కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ.. వైరా గ్రీన్‌ఫీల్డ్ హైవే దిగి పక్కన నిలిపి ఉంది. ఆ సమయంలో మధిర నుంచి వైరా వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి.. ఆగి ఉన్న కొబ్బరికాయల లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో ఆ లారీ వెళ్లి తన ముందున్న చెట్టును ఢీకొంది. దీంతో అందులో ఉన్న డైవర్లు గోవిందు, బాకారపు సతీశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్లో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లను పోలీసులు జేసీబీ యంత్రాల సహాయంతో బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.